పీఆర్సీ నివేదిక లేకుండా చర్చలు ఎందుకు?
- సీఎంతోనే తేల్చాలి.. అధికారులతో చర్చలు కాలయాపనే!
- మూడు డీఏలు, 51% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ వెంటనే ప్రకటించాలి
- CPS రద్దు చేయాలి.. రిటైర్డ్ CPS ఉద్యోగుల సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలి
- రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఏడ బోయిన శ్రీనివాస్ రెడ్డి
అక్కన్నపేట, : పీఆర్సీ నివేదికను వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు అందజేసి, నివేదికపై కనీసం ఒకరోజు అధ్యయనం చేసిన అనంతరం మాత్రమే చర్చలు జరపాలని రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఏడ బోయిన శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదిక అందకముందే చీఫ్ సెక్రటరీతో చర్చలు జరపడం వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 9న చీఫ్ సెక్రటరీ పీఆర్సీ కమిషన్‌కు రాసిన లేఖలో నివేదికను త్వరితగతిన సమర్పించాలని సూచించినప్పటికీ ఇప్పటివరకు నివేదిక ఎందుకు అందలేదో ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. నివేదికను ముందుగా సంఘాలకు అందించి, దానిపై అధ్యయనం చేసిన తర్వాతే తదుపరి చర్చలకు వెళ్లాలని జేఏసీ నాయకులను కోరారు.
సీఎంతోనే నేరుగా చర్చలు జరపాలి
గతంలో అధికారులు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రితో పీఆర్సీ అంశంపై చర్చలు జరిగాయని, ముఖ్యమంత్రి స్వయంగా జూన్ 2న పీఆర్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చారని శ్రీనివాస్ రెడ్డి గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ అధికారులతో మాత్రమే చర్చలు జరపడం వల్ల సమస్య పరిష్కారం కాకుండా కాలయాపన జరిగే అవకాశం ఉందన్నారు. పీఆర్సీ, డీఏలపై తుది నిర్ణయం తీసుకునే ముఖ్యమంత్రితోనే నేరుగా చర్చలు జరపాలని జేఏసీ నాయకత్వాన్ని కోరారు.
ఆర్థిక పరిస్థితి పేరుతో జాప్యం చేయొద్దు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదనే కారణంతో పీఆర్సీ, డీఏలను ఆలస్యం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. 2014లో రాష్ట్ర ఆదాయం రూ.1,00,678 కోట్లుగా ఉండగా ప్రస్తుతం రూ.3.24 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. రాష్ట్ర GSDP 10.7 శాతంగా ఉందని ఉప ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు, ప్రాజెక్టుల విషయంలో ఆర్థిక ఇబ్బందులు ప్రస్తావించకుండా ఉద్యోగుల డీఏలు, పీఆర్సీ విషయానికి వచ్చినప్పుడు మాత్రమే ఆర్థిక పరిస్థితిని కారణంగా చూపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
డీఏల లెక్కలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
ఉద్యోగుల హెల్త్ కార్డుల కోసం మూల వేతనంలో 1.5 శాతం చెల్లింపులు జరుగుతున్నాయని, 3.64 శాతం, 2.73 శాతం కలిపి రెండు డీఏలు 6.73 శాతం చెల్లించినా నెలకు సుమారు రూ.191 కోట్ల వ్యయం అవుతుందని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తం ఆరు డీఏలు కలిపి 15.47 శాతం చెల్లించినా నెలకు సుమారు రూ.464.1 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. ఈ లెక్కల నేపథ్యంలో డీఏలకు రూ.500 కోట్లకు పైగా వ్యయం అవుతుందని చెబుతున్న లెక్కలపై ప్రభుత్వం, అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు.
డీఏల విలీనానికి అంగీకరించొద్దు
ఎట్టి పరిస్థితుల్లోనూ డీఏల విలీనానికి అంగీకరించకూడదని జేఏసీ నాయకులకు శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు టీవీ చర్చల్లో పీఆర్సీ, డీఏలకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రభుత్వంతో చర్చల్లో స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని సూచించారు.
CPS రద్దు ఇప్పుడే చేయాలి
ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని CPS విధానాన్ని తక్షణమే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. CPSలో ఉన్న ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం సామాజిక భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరారు.
రిటైర్డ్ CPS ఉద్యోగుల పెన్షన్ సమస్యను సీరియస్‌గా పరిష్కరించాలి
CPSలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా సక్రమంగా జమ కాకపోవడం వల్ల వారికి రావాల్సిన పెన్షన్ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కనీస పెన్షన్ కూడా అందని పరిస్థితి ఏర్పడితే అది అత్యంత గంభీరమైన సమస్యగా పరిగణించి, ప్రభుత్వం వెంటనే సమీక్షించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ CPS ఉద్యోగుల ఖాతాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాను వెంటనే జమ చేసి, వారికి న్యాయంగా రావాల్సిన పెన్షన్ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలి
CPS ద్వారా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, డీఏ ఎరియర్స్ బిల్లులను ప్రత్యేకంగా పరిగణించి త్వరితగతిన మంజూరు చేసి చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు. పదవీ విరమణ అనంతరం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు బకాయిల చెల్లింపుల్లో మరింత జాప్యం చేయకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
రిటైర్డ్ CPS ఉద్యోగులకు EHS తప్పనిసరిగా వర్తింపజేయాలి
రిటైర్డ్ CPS ఉద్యోగులకు కూడా ఉద్యోగులు, పెన్షనర్ల మాదిరిగానే EHS వైద్య సదుపాయం తప్పనిసరిగా వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు. పదవీ విరమణ చేసిన తర్వాత వైద్య ఖర్చుల భారం పెరుగుతున్న నేపథ్యంలో EHS నుంచి వారిని దూరంగా ఉంచడం సరికాదన్నారు. రిటైర్డ్ CPS ఉద్యోగులందరికీ EHS కార్డులు, వైద్య సదుపాయాలు అందేలా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ.. మూడు డీఏలు వెంటనే ఇవ్వాలి
దసరా, రంజాన్, క్రిస్మస్ వంటి పండుగల సందర్భంగా పీఆర్సీ, డీఏలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రావాల్సిన మూడు డీఏలను తక్షణమే విడుదల చేయడంతో పాటు కనీసం 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే CPS రద్దు, రిటైర్డ్ CPS ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా, పెన్షన్ సమస్య, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, డీఏ ఎరియర్స్ బిల్లుల చెల్లింపు, EHS అమలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే నేరుగా చర్చించి తక్షణ పరిష్కారం సాధించేలా జేఏసీ నాయకత్వం కార్యాచరణ రూపొందించాలని ఏడ బోయిన శ్రీనివాస్ రెడ్డి కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


