గోండు గూడలో ఎస్పీ అఖిల్ మహాజన్ జనదర్బార్.
- - పోలీసులు-మీకోసం తో గూడలో ఎస్పీ సందడి..!
- - గంజాయిపై సమరభేరి.. గోండు గూడలో యువతకు ఎస్పీ పిలుపు..!
- - వైద్యం.. విద్య.. క్రీడలు.. గోండు గూడకు పోలీసుల కానుకలు..!
- - ఫ్లోరైడ్ బాధిత గూడకు ఆర్వో వాటర్ ప్లాంట్ హామీ..!
- - 200 మంది గ్రామస్తులకు ఉచిత వైద్య సేవలు..
- - ఎస్పీ భరోసాతో గిరిజన గూడలో ఆనందోత్సాహాలు.!
ఆదిలాబాద్ : ప్రజలకు మరింత చేరువై వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం, గ్రామాల్లో పోలీసు-ప్రజల సత్సంబంధాలను బలోపేతం చేయడం, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'పోలీసులు మీకోసం' కార్యక్రమంలో భాగంగా శనివారం నార్నూర్ మండలం గుండాల గోండు గూడ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన "పోలీసులు మీకోసం" కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా ఎస్పీతో పాటు పోలీసు అధికారులకు గ్రామ మహిళలు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై గ్రామ ప్రజలు, యువతకు అవగాహన కల్పించారు. "గంజాయిపై యుద్ధం చేయాలి.. మార్పు వల్లే గంజాయిని సమాజం నుంచి దూరం చేయవచ్చు" అని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. గ్రామాల్లో ఎవరైనా గంజాయి సాగు చేస్తున్నా లేదా మాదకద్రవ్యాల వ్యాపారం నిర్వహిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల సహకారం అత్యంత అవసరమని, గంజాయి రహిత సమాజ నిర్మాణమే జిల్లా పోలీసుల లక్ష్యమని తెలిపారు. చదువు పట్ల ఉన్న ఆవశ్యకతను తెలియజేశారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి అని తెలిపారు. చదువు వల్ల భవిష్యత్తు మారుతుందని తెలిపారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు 50 పుస్తకాలు పెన్నులను అందజేయడం జరిగింది. అదేవిధంగా నకిలీ బాబాలను, మంత్రాలను తంత్రాలను ఎలాంటి వైద్య అవసరం ఉన్న, ప్రభుత్వం గుర్తించిన ప్రభుత్వ ప్రైవేటు వైద్యులను సంప్రదించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణనష్టానికి దారితీస్తుందని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్ వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
అదేవిధంగా మంచి ఆహారపు అలవాట్లను అలవాటు చేసుకోవాలని, పూర్వకాలంలో మన పూర్వీకులు తిన్నటువంటి జొన్న ఆహారాన్ని తీసుకోవాల్సిందిగా సూచించారు. రక్తహీనతతో బాధపడుతున్న వారు వైద్య పరీక్షలను చేయించుకుని, సరైన చికిత్సను తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న గ్రామానికి త్వరలోనే ఒక ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ను అందజేయడం జరుగుతుందని దానిని గ్రామపంచాయతీ తరుపున సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ప్రారంభించారు.
దాదాపు ఆరు రంగాలలో నిష్ణాతులైన ఆదిలాబాద్ లోని ప్రైవేటు వైద్యుల బృందం చే గ్రామస్తులందరికీ ఉచితంగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందని ఈ క్యాంపులో 200 మంది గ్రామస్తులు పాల్గొని జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్, గైనకాలజీ, ఆప్తమాలజీ, డెంటల్, పీడియాట్రిషన్ విభాగాలలో వైద్య పరీక్షలను ఉచితంగా మందులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 200 మంది గ్రామస్తులు, మహిళలు, వృద్దులు చిన్నారులు పాల్గొని వైద్య పరీక్షలను చేయించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, నార్నూర్ సీఐ అంజమ్మ, ఎస్సై శ్రీ సాయి, గాదిగూడ ఎస్ఐ రమ్య, డాక్టర్లు అశోక్,రమా అశోక్, గోపాల్, తౌఫిక్, వంశీ, చంద్రకాంత్, గ్రామ సర్పంచ్ రాథోడ్ సురేష్, పటేల్ కుమ్రా మాల్కో, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, మహిళలు, యువతతో పాటు సుమారు 200 మంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


