పోలీసు కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి
హైదరాబాద్: మూసారాంబాగ్ శాలివాహన నగర్‌లో ఓ పోలీసు కానిస్టేబుల్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. అంబర్‌పేట్ హెడ్‌క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న ముత్తె చంద్రశేఖర్ (35) తన ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి సమయంలో చంద్రశేఖర్ ఓ యువతికి వీడియో కాల్ చేసినట్లు సమాచారం. వీడియో కాల్‌లో తాను ఉరివేసుకోబోతు న్నట్లు ఆమెకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆందోళనకు గురైన యువతి వెంటనే చైతన్యపురి పోలీసులకు సమాచారం అందించింది. చైతన్యపురి పోలీసులు ఈ విషయాన్ని మలక్‌పేట్ పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న మలక్‌పేట్ పోలీసులు వెంటనే శాలివాహన నగర్‌లోని చంద్రశేఖర్ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు గుర్తించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చంద్రశేఖర్ మృతికి దారితీసిన కారణాలు, యువతితో జరిగిన వీడియో కాల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నా రు. కానిస్టేబుల్ మృతికి అసలు కారణాలు పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


