కిసాన్ మేళాలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సూచనలు
జిల్లా నాగర్ కర్నూల్ : ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ రైతులకు సూచించారు. పాలెం కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కిసాన్ మేళా, రైతు-శాస్త్రవేత్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైతు కమిషన్ సభ్యుడు ఏవీఎన్ రెడ్డితో కలిసి వ్యవసాయ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాతావరణం, నీటి లభ్యత, భూమి స్వభావం, మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలన్నారు. సాగుకు ముందు తప్పనిసరిగా నేల పరీక్షలు చేయించుకుని, భూసారానికి అనుగుణంగా ఎరువులు వాడాలని సూచించారు. జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రబీలో వరి సాగుకు దూరంగా ఉండి, తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు దృష్టి పెట్టాలన్నారు.రసాయన ఎరువులు, పురుగుమందులను అవసరానికి మించి వాడరాదని, సమగ్ర సస్యరక్షణ, సూక్ష్మ సాగునీరు, యాంత్రీకరణ, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలన్నారు. మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు సాగు చేసి, నాణ్యత, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ పై దృష్టి పెడితే మెరుగైన ఆదాయం వస్తుందన్నారు. రైతులు సమూహాలుగా ఏర్పడి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ ద్వారా అదనపు ఆదాయం పొందాలని, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.రైతు కమిషన్ సభ్యుడు ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ పంటల మార్పిడి విధానాన్ని పాటిస్తూ లాభదాయక వ్యవసాయం వైపు అడుగులు వేయాలన్నారు. అనంతరం వ్యవసాయ యంత్ర పరికరాలు, ఆధునిక సాగు పద్ధతులు, తెగుళ్లు, చీడపీడల నివారణపై శాస్త్రవేత్తలు రైతులకు సూచనలు చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


