గణపతి నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
- నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలి
- అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా విద్యుత్ కేబుళ్లు, ఇతర సమస్యలను ముందుగానే పరిష్కరించాలి
- బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులతో సమీక్ష
ఆదిలాబాద్ : )గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. ఆదిలాబాద్ పట్టణంలోని అశోక్ రోడ్, గాంధీచౌక్, అంబేద్కర్ చౌక్, వినాయక్ చౌక్, మహాలక్ష్మి వాడ, జై జవాన్ నగర్, క్రాంతి నగర్ తదితర ప్రాంతాల్లో నిమజ్జన రూట్ పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమజ్జన రూట్‌లోని మసీదుల వద్ద చేపట్టిన ఏర్పాట్లను సైతం పరిశీలించి, సంబంధిత అధికారులతో వివరాలను తెలుసుకున్నారు. నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా విద్యుత్ కేబుళ్లు, వైర్లను ముందుగానే సురక్షితంగా పైకి ఏర్పాటు చేయడం, పట్టణం లోని దారులపై ఉన్న ఇతర అడ్డంకులను తొలగించడం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. నిమజ్జన కార్యక్రమంలో గణపతి విగ్రహాలకు, భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ బందోబస్తు, రూట్ నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ సునీల్ కుమార్, టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, క్లస్టర్, సెక్టార్ ఇన్‌చార్జిలు, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


