అక్షిత రాణిది ప్రీ ప్లాన్ మర్డర్
- అనంత లోకాలకు పంపిన రాక్షసత్వం
- యువతి మృతి కేసులో ట్విస్ట్
- పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు
- సాంకేతిక ఆధారాలతో కేసు ఛేదింపు
- ఆత్మహత్యగా చిత్రీకరణకు యత్నం
- ఏ-1, ఏ-2 అరెస్ట్ చూపిన డీసీపీ
పెద్దపల్లి బ్యూరో చీఫ్ : అభం శుభం తెలియని అమ్మాయిని ఆశల పల్లకిలో ఎక్కించి.. ఆపై అనంత లోకాలకు పంపిన రాక్షసత్వం. రామగుండంలో కలకలం రేపిన 'యువతి హత్య' వెనుక ఉన్న చీకటి కోణాలు ఇవే. చదువుకుని ప్రయోజకు రాలై, కన్నవాళ్ల కళ్లలో ఆనందం చూడాలని కలలు కన్న ఆ యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. నమ్మినవారే నయవంచకులుగా మారి, ప్రాణాలు తీసిన ఈ దారుణ ఘటన రామగుండం కమిషనరేట్ పరిధిలో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రేమ, ఈర్ష్య, అహంకారాలు కలిసి ఒక నిండు ప్రాణాన్ని ఎలా బలిగొన్నాయో గోదావరిఖని పోలీసులు ఛేదించిన తీరు చూస్తే గుండె తరుక్కుపోతుంది.
కలల లోకం నుంచి కాలరాత్రిలోకి
జీవితాన్ని ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించాల్సిన వయసు అది. డిప్లొమా పూర్తి చేసి, హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీటెక్ మైనింగ్ చదువుతున్న ఆ యువతి శిక్షణ కోసం గోదావరిఖనికి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో ఆమె జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. ఒకరు తనకంటే వయసులో పెద్దవాడైన, భార్యాపిల్లలున్న కాంట్రాక్ట్ లెక్చరర్ జెట్టి నవీన్ కుమార్, మరొకరు సింగరేణి ఓవర్‌మన్‌గా పనిచేస్తున్న బొమ్మకంటి రవికుమార్. నవీన్‌తో ఏర్పడిన పరిచయం తొలుత సాన్నిహిత్యంగా మారినా, కాలక్రమేణా ఆమె అతనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. రవి కుమార్‌తో ఏర్పడిన సాన్నిప్యతే ఆమె పాలిట శాపంగా మారింది. ఆమె తనను కాదనుకొని మరొకరితో సన్నిహితంగా మెలగడాన్ని నవీన్ జీర్ణించుకోలేకపోయడు. 'తాను దక్కకపోతే ఎవరికీ దక్కకూడదు' అనే వికృత మనస్తత్వంతో ఒక రాక్షస ప్లాన్ వేసుకున్నాడు.
ముందస్తు ప్లాన్... మృత్యు కారులో కడవరి ప్రయాణం...!
సెప్టెంబర్ 12, 2026... ఆ రోజు సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆ యువతిని గోదావరిఖని ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్స్ వద్ద తన ఎకోస్పోర్ట్ కారులో ఎక్కించుకున్నాడు నవీన్. అప్పటికే అతని మనసులో విషం నిండి ఉంది. కారును ఎన్టీపీసీ, ఐఓసీ ప్రాంతాల్లో తిప్పుతూ ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు.
తనపై రవికుమార్ అత్యాచారం చేయడం వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా ఒక సూసైడ్ నోట్ బలవంతంగా రాయించాడు. ఆ పత్రాన్ని ఆమె ఫోన్‌లో ఫొటో తీసిన తర్వాత.. ముందే సిద్ధం చేసుకున్న పురుగుల మందును ఆమె గొంతులో బలవంతంగా పోశాడు.
మానవత్వం మరిచిన మృగాడు...!
పురుగుల మందు ప్రభావంతో ఆ యువతి కారులోనే స్పృహ కోల్పోయింది. వెంటనే ఆసుపత్రికి తరలిస్తే ఆమె బతికేదేమో! కానీ, తన నేరం బయటపడుతుందన్న భయంతో ఆ మృగాడికి కనికరం రాలేదు. సాయంత్రం వరకు కారును వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ వైద్య సహాయం అందకుండా ఆలస్యం చేశాడు. ఆ తర్వాత ఆమె ఫోన్ నుంచి తండ్రికి ఫోన్ చేసి, ఆమె ఆత్మహత్య చేసుకుందంటూ కట్టుకథ అల్లాడు. రాత్రి ఏడున్నర ప్రాంతంలో ఆమెను ఇంటికి తీసుకెళ్లి, తల్లిదండ్రులను కూడా నమ్మించి ఆసుపత్రికి చేర్చి పరారయ్యాడు. మరుసటి రోజు ఆ యువతి మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు వదిలింది.
మీడియా సమావేశంలో డిసిపి వెల్లడించిన వివరాలు...!
ఆదివారం గోదావరిఖని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో జరిగిన మీడియా సమావేశంలో డిసిపి రామ్‌రెడ్డి నిందితులు ఏ-1, ఏ-2 లను అరెస్ట్ చూపించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను, సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితులను ఎలా పట్టుకున్నదీ డిసిపి మీడియా సమావేశంలో వెల్లడించారు. యువతి మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నవీన్ సర్వవిధాలా ప్రయత్నించినప్పటికీ, పోలీసులు శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేసి గుట్టు రట్టు చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు నవీన్ కుమార్‌తో పాటు, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి కుమార్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సింగరేణి అధికారుల నిర్లక్ష్యం, ఇతర కోణాలపై కూడా సమగ్ర విచారణ జరుగుతోందని తెలిపారు.నమ్మకం అనే పదానికి నిలువెత్తు రూపమైన యువతి ఆశలు ఆవిరైపోయాయి. క్షణికావేశం, ఈర్ష్య కలిగించే అంధత్వం మనుషులను ఎలా రాక్షసులుగా మారుస్తుందో ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. కన్న బిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల రోదనలు గుండెల్ని పిండేస్తున్నాయి. పోలీసులు నిందితులను చట్టం ముందుకు తెచ్చినా, కోల్పోయిన ప్రాణం మాత్రం వెనక్కి రాదు కదా.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


