పీఆర్సీ నివేదికను వెంటనే విడుదల చేయాలి
- సీఎంతోనే చర్చలు జరపాలి.. 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ, మూడు డీఏలు ఇవ్వాలి
- రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఏడ బోయిన శ్రీనివాస్ రెడ్డి
అక్కన్నపేట, : పీఆర్సీ నివేదికను తక్షణమే విడుదల చేసి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే నేరుగా చర్చలు జరపాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం చీఫ్ సెక్రటరీతో సమావేశం జరుగుతున్న నేపథ్యంలో సంఘాల జిల్లా, రాష్ట్ర బాధ్యులు జేఏసీ నాయకత్వం ముందు పలు అంశాలను స్పష్టంగా ఉంచాలని కోరారు. ఇప్పటివరకు పీఆర్సీ నివేదిక రాకుండానే చీఫ్ సెక్రటరీతో ఎలాంటి అంశాలపై చర్చలు జరుపుతారని ప్రశ్నించారు. ఈ నెల 9న చీఫ్ సెక్రటరీ పీఆర్సీ కమిషనర్‌కు రాసిన లేఖలో నివేదికను "expeditious submission" చేయాలని పేర్కొన్నప్పటికీ పది రోజులు గడిచినా నివేదిక ఎందుకు అందలేదో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ముందుగా పీఆర్సీ నివేదిక కాపీని సంఘాలకు అందజేసి, కనీసం ఒకరోజు అధ్యయనం చేసిన అనంతరం మాత్రమే చర్చలకు రావాలని జేఏసీ స్పష్టం చేయాలని కోరారు.
సీఎంతోనే నేరుగా చర్చలు జరపాలి
గతంలో అధికారులు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రితో చర్చలు జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా జూన్ 2న పీఆర్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ కేవలం అధికారులతో చర్చలు జరపడం వల్ల సమస్య పరిష్కారం కాకుండా కాలయాపన జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. చీఫ్ సెక్రటరీతో పాటు ఇతర అధికారులు చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రికి నివేదించడం వరకే పరిమితం అవుతారని, అందువల్ల నేరుగా ముఖ్యమంత్రితోనే చర్చలు జరపాలని జేఏసీ నాయకులను కోరారు.
ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలు వెల్లడించాలి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదనే కారణంతో ఉద్యోగుల డీఏలు, పీఆర్సీని ఆలస్యం చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. 2014లో రాష్ట్ర ఆదాయం రూ.1,00,678 కోట్లుగా ఉండగా ప్రస్తుతం రూ.3.24 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. రాష్ట్ర GSDP 10.7 శాతంగా ఉందని ఉప ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల జీతభత్యాలు, డీఏలు, పీఆర్సీ విషయానికి వచ్చినప్పుడు మాత్రమే ఆర్థిక పరిస్థితిని కారణంగా చూపడం ఎందుకు అని ప్రశ్నించారు.
డీఏల లెక్కలపై స్పష్టత ఇవ్వాలి
హెల్త్ కార్డుల కోసం ఉద్యోగులు తమ మూల వేతనంలో 1.5 శాతం చెల్లిస్తున్నారని, ఇదే లెక్కన రెండు డీఏలు 3.64 శాతం, 2.73 శాతం కలిపి 6.73 శాతం చెల్లిస్తే నెలకు సుమారు రూ.191 కోట్ల మేర వ్యయం అవుతుందని పేర్కొన్నారు. మొత్తం ఆరు డీఏలు కలిపి 15.47 శాతం చెల్లించినా నెలకు సుమారు రూ.464.1 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. ఈ లెక్కల నేపథ్యంలో డీఏల కోసం రూ.500 కోట్లకు పైగా ఖర్చవుతుందని అధికారులు చెబుతున్న లెక్కలపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
ఉద్యోగుల వాస్తవాలను ప్రజలకు వివరించాలి
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు టీవీ చర్చల్లో ఉద్యోగుల సమస్యలకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొడంగల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చేసిన పీఆర్సీకి సంబంధించిన వ్యాఖ్యలపై కూడా సంఘాల నాయకులు వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయకపోతే ప్రజల్లో ఏకపక్ష అభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
డీఏల విలీనానికి అంగీకరించొద్దు
ఎట్టి పరిస్థితుల్లోనూ డీఏల విలీనానికి అంగీకరించకూడదని జేఏసీ నాయకులను కోరారు. దసరా సందర్భంగా పీఆర్సీ ఇవ్వాలని కోరినప్పుడు ముఖ్యమంత్రి రంజాన్ కూడా పెద్ద పండుగేనని పేర్కొన్న నేపథ్యంలో, క్రిస్మస్ కూడా పెద్ద పండుగేనని గుర్తుచేస్తూ పీఆర్సీతో పాటు డీఏలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు.
51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఇవ్వాలి
ముఖ్యమంత్రితో నేరుగా చర్చలు జరిపి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రావాల్సిన మూడు డీఏలను తక్షణమే విడుదల చేయడంతో పాటు కనీసం 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని వెంటనే ప్రకటించాలని జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కోరారు. పీఆర్సీ నివేదికను ముందుగా సంఘాలకు అందజేసి, దానిపై సమగ్రంగా చర్చించిన తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


