క్రమశిక్షణ, ప్రణాళికతోనే కొలువు సాధించవచ్చు
పోలీస్ రిక్రూట్మెంట్ పై అవగాహన సదస్సు
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు సోమవారం రోజున పోలీసు ఉద్యోగాల రిక్రూట్మెంట్ పై అవగాహన సదస్సును కె.ఎన్.ఆర్ ఇన్స్టిట్యూట్, కరీంనగర్ వారి సౌజన్యంతో వాణిజ్య శాస్త్ర విభాగము మరియు జాతీయ సేవా పథకం యూనిట్ వారు సంయుక్తంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయగిరి బిక్షపతి మాట్లాడుతూ సరైన ప్రణాళిక, సమయపాలన, కార్యాచరణతోనే పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చును అని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో పెద్ద సంఖ్యలో కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాల నియామకపు ప్రవేశ ప్రకటన విడుదల చేసిందని, దానికిగాను కళాశాలలో పోటీ పరీక్షలకై అర్హులైన విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో పాటు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందజేస్తున్నట్లు తెలిపారు. రిసోర్స్ పర్సన్ రాజు, కెఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ మాట్లాడుతూ ఎస్సై మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు కావలసిన అర్హతల గురించి, పరీక్షా విధానం, సిలబస్, జోనులవారీగా ఉద్యోగాల సంఖ్య, ప్రణాళిక రూపకల్పన, ప్రాథమిక అంశాలపై అవగాహనా మొదలగునవి సవివరముగా తెలిపారు. ఆశావాహులైన కళాశాల విద్యార్థులకు నామమాత్రపు రుసుముతో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. డాక్టర్ చంద్రమౌళి మాట్లాడుతూ కళాశాలలో పోటీ పరీక్షల కై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి పోటీ పరీక్షల శిక్షణకై విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ బి. నైనా దేవి, డాక్టర్ చంద్రమౌళి ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


