రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
బైక్‌ను తప్పించబోయి కిందపడటంతో అక్కడికక్కడే మృత్యువాత
చిలిపిచేడ్, మెదక్ : చిలిపిచేడ్ మండలం గౌతాపూర్ గ్రామ ప్రధాన రహదారి వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. హత్నూర మండలం షిక్ మద్దూర్ గ్రామానికి చెందిన బేగరి అనురాధ ఇద్దరు పిల్లలతో కలిసి బ్యాంకు మిత్రగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. శనివారం నాగులదేవులపల్లి గ్రామానికి వెళ్లి తన తమ్ముడు అనిల్‌కుమార్‌కు రాఖీ కట్టి, అనంతరం తన కుమారుడితో కలిసి అమ్మగారి గ్రామమైన చిట్కూల్‌కు ద్విచక్ర వాహనంపై బయలుదేరింది. గౌతాపూర్ గ్రామం వద్దకు చేరుకోగానే గుజిరీతండాకు చెందిన రామావత్ మదన్ నర్సాపూర్ వైపు నుంచి తన గ్రామానికి వెళ్తూ ఒక్కసారిగా ద్విచక్ర వాహనాన్ని గౌతాపూర్ వైపు మళ్లించినట్లు సమాచారం. దీంతో ఎదురుగా వస్తున్న అనిల్‌కుమార్ వాహనాన్ని తప్పించబోయి ఢీకొని కిందపడగా, వెనుక కూర్చున్న అనురాధ కూడా కిందపడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై చిలిపిచేడ్ ఎస్‌ఐ నర్సింలును వివరణ కోరగా, తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


