ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్ చేయాలి
దళిత ప్రజాప్రతినిధులంటే బీఆర్‌ఎస్‌కు చిన్నచూపు: కాంగ్రెస్ నేతలు
మిడ్జిల్: రాజ్యాంగబద్ధమైన గౌరవప్రదమైన పదవిలో ఉన్న దళిత స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలం ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహమ్మద్ గౌస్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజ్ అన్నారు సోమవారం మిడ్జిల్ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్ పదవికి ప్రత్యేకమైన గౌరవం ఉంటుందని, అలాంటి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న దళిత స్పీకర్‌ను అసభ్య పదజాలంతో దూషించడం బీఆర్‌ఎస్ పార్టీ అహంకారానికి, దళితుల పట్ల ఉన్న చిన్నచూపుకు నిదర్శనమని మండిపడ్డారు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని గౌరవిం చడం ప్రతి ప్రజాప్రతినిధి కనీస బాధ్యత అని పేర్కొన్నారు. దళిత స్పీకర్‌ను అవమానించడం అంటే ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా మొత్తం దళిత సమాజాన్ని అవమానించినట్లేనని అన్నారు. తాతా మధుసూదన్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని స్పీకర్‌కు, దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఎమ్మెల్సీ పదవి నుంచి ఆయనను బర్తరఫ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో ప్రజలే బీఆర్‌ఎస్ నాయకులకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, జిల్లా పార్టీ నాయకులు సాయులు, వాడ్యాల విజయ్ కుమార్, నర్సింహా, జంగయ్య, మండల యూత్ ప్రెసిడెంట్ కృష్ణ యాదవ్, జిల్లా, మండల నాయకులు ఉస్మాన్, చంద్రమౌళి, ఆదామ్, చెన్నయ్య, నిరంజన్, వెంకటయ్య, రామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


