సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి ఎస్పీ

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి ఎస్పీ

  • ఆపదలో 112.. ప్రజలకు పోలీసుల భరోసా
  • సైబర్‌ నేరాలపై గ్రామస్థాయిలో అవగాహన.. సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
  • పెండింగ్‌ కేసులకు స్వస్తి పలికి సత్వర న్యాయం అందించాలి
  • చిలిపిచేడ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు వార్షిక తనిఖీ

చిలిపిచేడ్‌,   (మెదక్ జిల్లా)  : ప్రజలకు ఏ కష్టం వచ్చినా పోలీసు వ్యవస్థ అండగా ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో ఆందోళనకు గురికాకుండా వెంటనే 112కు కాల్‌ చేసి పోలీసుల సహాయం పొందాలని మెదక్‌ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్‌ సూచించారు. నేరం జరిగిన తర్వాత స్పందించడమే కాకుండా.. నేరం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడమే పోలీసుల ప్రధాన లక్ష్యంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పిస్తూ, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం చిలిపిచేడ్‌ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. స్టేషన్‌ నిర్వహణ, నేరాల దర్యాప్తు, పెండింగ్‌ కేసులు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును సమగ్రంగా సమీక్షించారు. ఎఫ్‌ఐఆర్‌లు, స్టేషన్‌ డైరీ, రౌడీషీట్లు, సస్పెక్ట్‌షీట్లు, బీట్‌ బుక్స్‌, సీజ్‌ ప్రాపర్టీ, వారెంట్లు, సీసీటీఎన్‌ఎస్‌, ఈ-సాక్ష్య తదితర రికార్డులను పరిశీలించారు. కేసుల దర్యాప్తులో జాప్యం లేకుండా, పెండింగ్‌ కేసులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు పూర్తి చేయాలని సూచించారు. బాధితుడికి పోలీస్‌స్టేషన్‌ భరోసా కేంద్రంగా నిలవాలి అని ఎస్పీ పేర్కొన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదగా వ్యవహరిస్తూ వారి సమస్యలను సానుభూతితో ఆలకించాలని, నాణ్యమైన, పారదర్శక దర్యాప్తు ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందేలా పనిచేయాలని ఆదేశించారు. పోలీసుల పనితీరుపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రస్తుతం సైబర్‌ నేరాలు కొత్త రూపాల్లో ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అనుమానాస్పద లింకులు, ఫోన్‌ కాల్స్‌, సందేశాలు, ఆన్‌లైన్‌ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను యువతకు వివరించి, వాటికి దూరంగా ఉండేలా చైతన్యం తీసుకురావాలని పేర్కొన్నారు. నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం అని ఎస్పీ తెలిపారు. దుకాణాలు, వ్యాపార సంస్థలు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి గ్రామంపై విలేజ్‌ పోలీస్‌ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, రౌడీషీటర్లు, అనుమానితుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. బీట్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేసి నేరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అనంతరం పోలీస్‌ సిబ్బందితో ఎస్పీ సమావేశమై విధుల నిర్వహణ, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రజల భద్రతే పోలీసుల తొలి బాధ్యత.. ప్రజల సహకారమే నేర నియంత్రణకు బలం అనే స్ఫూర్తితో సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎస్పీ నరేందర్‌గౌడ్‌, సీఐలు సందీప్‌రెడ్డి, రంగాకృష్ణ, ఎస్‌ఐ నర్సింలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 21

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్ చేయాలి ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్ చేయాలి
మిడ్జిల్: రాజ్యాంగబద్ధమైన గౌరవప్రదమైన పదవిలో ఉన్న దళిత స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలం ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్...
బీజేపీ, బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం
చిలుకూరు లక్ష్మీ నగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం 
పినపాకలో వైద్యం గాల్లో
జాతీయ రహదారి కి ఇరువైపులా పార్కింగ్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
అక్రమ అరెస్టులతో మా గొంతు నొక్కలేరు