పేదల బతుకుల్లో భరోసా.. సంక్షేమంతో కాంగ్రెస్ సర్కార్
- ఇందిరమ్మ ఇళ్ల నుంచి సన్నబియ్యం వరకు.. పేదలకు ప్రభుత్వ అండ!
- ప్రాణహిత–చేవెళ్లకు అడ్డుపడింది సబితా ఇంద్రారెడ్డే!
- అదే పూర్తయి ఉంటే చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు సస్యశ్యామలమయ్యేవి : కాంగ్రెస్ నాయకుల ధ్వజం
- నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న నాయకుడు గడ్డం ప్రసాద్ కుమార్
మర్పల్లి,: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు అడ్డుపడింది మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డేనని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎద్దుమైలారం వద్ద 351 అడుగులకు పైగా టన్నెల్ తవ్విన అనంతరం వ్యక్తిగత స్వలాభం కోసం ప్రాజెక్టును నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టారని ఆరోపించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయి ఉంటే నేడు చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు ప్రాంతాలు సస్యశ్యామలమయ్యేవని అన్నారు.శుక్రవారం మర్పల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా శనివారం మర్పల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు తుమ్మల సురేష్ యాదవ్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సురేష్ యాదవ్, సర్పంచ్ రామేశ్వర్, నాయకులు సుభాష్ యాదవ్, కృష్ణారెడ్డి, రవీందర్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు రఫీ యోధిన్ మాట్లాడుతూ..సబితా ఇంద్రారెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యున్నత గౌరవం కల్పించిందని నాయకులు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆమెను ఆప్యాయంగా ‘చేవెళ్ల చెల్లెమ్మ’గా పిలిచారని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలను చేవెళ్ల నుంచి ప్రారంభిస్తూ ఆమెకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని వ్యక్తిగత స్వలాభం, ఆస్తుల పరిరక్షణ కోసమే వీడి పదిమంది ఎమ్మెల్యేలతో బీఆర్‌ఎస్‌లో చేరారని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీని వీడవద్దని, ప్రతిపక్ష నేత హోదా కోల్పోయే అవకాశం ఉందని అప్పటి కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేసినా సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారారని విమర్శించారు.
రూ.600 కోట్లతో రోడ్ల పనులు
వికారాబాద్ నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ.600 కోట్ల నిధులు మంజూరయ్యాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మర్పల్లి మండల కేంద్రంలో సుమారు రూ.40 కోట్లతో రోడ్డు పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మిషన్ భగీరథ పైపులైన్లు, విద్యుత్ పనులు తదితర కారణాలతో కొంత ఆలస్యం జరిగినప్పటికీ పనులు కొనసాగుతున్నాయని అన్నారు.అభివృద్ధి పనులు జరుగుతున్న ఇదే రోడ్డుపై సమావేశం ఏర్పాటు చేసి అభివృద్ధి కనిపించడం లేదని మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మండలంలో అర్హులైన పేదలకు 976 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేసిందన్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన సన్నబియ్యం తినాలనే లక్ష్యంతో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. మండల మహిళా సమాఖ్యకు రుణం ద్వారా బస్సు కొనుగోలు చేయడంతో ప్రస్తుతం నెలకు సుమారు రూ.1.30 లక్షల ఆదాయం సమాఖ్యకు వస్తోందన్నారు. మహిళలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని పేర్కొన్నారు.వికారాబాద్ జిల్లా అభివృద్ధి వెనుకబడటానికి సబితా ఇంద్రారెడ్డి హయాంలో తీసుకున్న నిర్ణయాలే కారణమని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. వికారాబాద్ ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయడంతో పాటు సమస్యలపై వేగంగా స్పందిస్తూ పనులను పూర్తి చేయిస్తున్నారని అన్నారు. రాష్ట్రం అప్పుల భారంలో ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ రాజకీయ అనుభవం గురించి మాట్లాడే ముందు ప్రజల కోసం చేసిన సేవలను చెప్పాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు. వైద్యుడిగా ఉన్న సమయంలో నిరుపేదలకు సేవ చేయకుండా లాభార్జనే ధ్యేయంగా ఆసుపత్రి నిర్వహించారని ఆరోపించారు. ఇకనైనా కల్లబొల్లి మాటలు మానుకోవాలని హితవు పలికారు.
సురేఖపై సబితా ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. గతంలో జరిగిన పరిణామాలపై అప్పట్లో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి బీఆర్‌ఎస్‌లో మంత్రిగా చేరిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీని కాంగ్రెస్ నాయకులు ‘ఫామ్‌హౌస్ పార్టీ’గా అభివర్ణించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా కేసీఆర్ ప్రజల మధ్యకు వచ్చి సమస్యలపై మాట్లాడలేదని విమర్శించారు. ప్రజలకు దూరమైన కారణంగానే బీఆర్‌ఎస్ రాజకీయంగా బలహీనపడిందన్నారు. బీఆర్‌ఎస్‌నా.. టీఆర్‌ఎస్‌నా అన్నది తెలియని పరిస్థితిలో రెండు రకాల జెండాలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతాంగానికి కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఇకపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తామని నాయకులు తెలిపారు. త్వరలో గ్రామస్థాయి, మండలస్థాయి సమావేశాలు నిర్వహించి మర్పల్లి మండల కేంద్రంలో భారీ సభ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ ఉపసర్పంచ్ కొప్పుల ప్రభు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోటిగారి జగదీశ్వర్, నాయకులు నాగేష్, మధుసూదన్ రెడ్డి, దివాకర్, గణేష్ ఈశ్వర్, వైద్యనాథ్, మొరంగపల్లి సురేష్, గోపాల్ నాయక్, వడ్ల వెంకటేశం, మారుతి, వసంత్, రవీందర్ రెడ్డి, పాండురంగారెడ్డి, సలీం ఖాన్, ఇనాయత్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


