చిలుకూరు లక్ష్మీ నగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
- తనిఖీలలో 163 ద్విచక్ర వాహనాలు, 31 ఆటోలు,9 ట్రాలీ లు, 6 కార్లు,1 ట్రాకర్ స్వాధీనం
- 7 గురు సస్పెక్ట్ షీటర్ల తనిఖీ.
- 150 మంది పోలీసు సిబ్బందితో తెల్లవారుజామున విస్తృత తనిఖీలు చేసిన
- ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి
ఆదిలాబాద్ : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడం, నేరాల నియంత్రణ, ప్రజలతో పోలీసుల అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా సోమవారం జిల్లా కేంద్రంలోని చిలుకూరి లక్ష్మీ నగర్ లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఆదేశాల మేరకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని తెల్లవారుజామున నుండి నిర్వహించినట్లు ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 5 గంటల నుంచే సుమారు 150 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 163 ద్విచక్ర వాహనాలు, 31 ఆటోలు,9 ట్రాలీ ఆటోలు, 6 కార్లు, ఒక ట్రాక్టర్ తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ నెంబర్ ప్లేట్ అమర్చిన ఒక ద్విచక్ర వాహనాన్నీ స్వాధీనం చేసుకొని, (బి ఎన్ ఎస్) సెక్షన్ 318(4) ప్రకారం చీటింగ్ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఆసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం లేదా అక్రమంగా తరలించడం నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే గంజాయి నిర్మూలనకు జిల్లా పోలీసులు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని, గంజాయి సేవించడం, నిల్వ ఉంచడం, రవాణా చేయడం, సరఫరా చేయడం లేదా విక్రయించడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యత తెలియజేస్తూ కాలనీ మొత్తం కలిసికట్టుగా సిసిటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని తెలిపారు, నిబంధనలు ఉల్లంఘించిన కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐలు కె నాగరాజు,రహీం పాషా, బి ప్రణయ్ కుమార్, పద్మ, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు టి. మురళి, ఎన్ చంద్రశేఖర్, ఎస్సైలు, రిజర్వ్ సిబ్బంది, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


