పినపాకలో వైద్యం గాల్లో
- సమయపాలనకు మంగళం పాడుతున్న వైద్యాధికారి
- రోగుల ఎదురుచూపులే శరణ్యం, ఎమ్మెల్యే వార్నింగ్ బేఖాతర్
పినపాక : పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందాలని ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ డాక్టర్ వస్తారో రారో తెలియని పరిస్థితి. సమయపాలన పూర్తిగా కరువైంది. నిబంధనల ప్రకారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు PHC లో వైద్యాధికారి అందుబాటులో ఉండాలి. ఇది ప్రభుత్వ నిబంధన. కానీ పినపాకలో మాత్రం ఉదయం 11 గంటలైనా చాంబర్ ఖాళీగానే ఉంటోంది. మీడియా వెళ్లి చూడగా డాక్టర్ టేబుల్, కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. బయట మాత్రం వృద్ధులు, రోగులతో తల్లులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు.
రోగుల ఆవేదన:
"పొద్దున 9 గంటకే వచ్చాను బాబు, ఇప్పుడు 11అయింది. డాక్టర్ గారు ఇంకా రాలేదు. నా సమస్య ఎవరికి చెప్పుకోవాలి అంటూ గడ్డంపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. మరో వృద్ధులు , చిన్నారులు" వివిధ ప్రాంతాల నుంచి వచ్చాము, డాక్టర్ లేడు" అని వాపోయారు.
- సిబ్బంది ఏమంటున్నారు?
ఈ విషయంపై అక్కడున్న సిబ్బందిని ప్రశ్నిస్తే "డాక్టర్ గారు వస్తారో రారో మాకు తెలియదు, మాకు సమాచారం లేదు" అని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. దీంతో రోగులు దిక్కుతోచని స్థితిలో వెనుదిరుగుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లలేక నరకయాతన పడుతున్నారు.ఎమ్మెల్యే వార్నింగ్ కూడా బేఖాతర్ ఇదే విషయంపై ఇటీవల పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు సకాలంలో హాజరు కావాలని, నిర్లక్ష్యం వీడాలని హెచ్చరించారు. అయినా పినపాకలో మాత్రం పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఎమ్మెల్యే హెచ్చరికను కూడా లెక్క చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పినపాక PHC లో బయోమెట్రిక్ హాజరును వెంటనే అమలు చేయాలి. వైద్యాధికారి రోజూ సమయానికి హాజరయ్యేలా DMHO, కొత్తగూడెం చర్యలు తీసుకోవాలి.ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి. పేద గిరిజన ప్రజలు నమ్ముకున్న ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే వారు ఎక్కడికి వెళ్లాలి? జిల్లా వైద్యాధికారి స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


