నూర్‌బాషా–దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
- జీవో నంబర్ 125 అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలి:
- తెలంగాణ ముస్లిం బీసీ వెల్ఫేర్ జేఏసీ వైస్ చైర్మన్ మహమ్మద్ రాజమ్మద్
హైదరాబాద్: నూర్‌బాషా–దూదేకుల సమాజం అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముస్లిం బీసీ వెల్ఫేర్ చైర్మన్ మహమ్మద్ రఫీ,జేఏసీ వైస్ చైర్మన్ మహమ్మద్ రాజమ్మద్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2010లో జారీ చేసిన జీవో నంబర్ 125కు అనుగుణంగా నూర్‌బాషా–దూదేకుల సమాజానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని కోరారు. నూర్‌బాషా–దూదేకుల సమాజం విద్య, ఉపాధి, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఇప్పటికీ అనేక సమస్యలను ఎదుర్కొంటోందని రాజమ్మద్ పేర్కొన్నారు. విద్యలో వెనుకబాటుతనం, యువతలో నిరుద్యోగం, చిన్న వ్యాపారాలకు పెట్టుబడి కొరత, సంప్రదాయ వృత్తుల క్షీణత, మహిళలకు పరిమిత ఆర్థిక అవకాశాలు వంటి సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కార్పొరేషన్ అవసరమని వివరించారు. “మనం ఎవరికీ వ్యతిరేకం కాదు. ఏ ప్రభుత్వానికీ, ఏ రాజకీయ పార్టీకి శత్రువులం కాదు. మన సమాజానికి న్యాయం జరగాలన్నదే మా ప్రధాన లక్ష్యం. మాకు హామీలు వద్దు.. అమలు కావాలి. మాటలు వద్దు.. కార్యాచరణ కావాలి. ప్రకటనలు వద్దు.. కార్పొరేషన్ కావాలి” అని మహమ్మద్ రాజమ్మద్ స్పష్టం చేశారు.
జీవో ఉంది.. మరి కార్పొరేషన్ ఎక్కడ?
2010లో జీవో నంబర్ 125 ద్వారా నూర్‌బాషా–దూదేకుల సమాజ సంక్షేమానికి సంబంధించిన చర్యలకు మార్గం ఏర్పడిందని రాజమ్మద్ తెలిపారు. అయితే సంవత్సరాలు గడిచినా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కాకపోవడం బాధాకరమన్నారు.
“ప్రభుత్వాలు మారాయి.. ముఖ్యమంత్రులు మారారు.. మంత్రులు, అధికారులు మారారు.. కానీ మన సమాజ పరిస్థితి ఎందుకు మారలేదు? జీవో ఉంది.. సమాజం ఉంది.. సమస్యలు ఉన్నాయి.. అవసరం ఉంది.. మరి ప్రత్యేక కార్పొరేషన్ ఎక్కడ?” అని ప్రశ్నించారు.ఈ ప్రశ్న ఎవరో ఒకరిని నిందించడానికి కాదని, నూర్‌బాషా–దూదేకుల సమాజ భవిష్యత్తు కోసం ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రశ్న అని ఆయన అన్నారు.
కార్పొరేషన్‌తో సమగ్ర అభివృద్ధి
ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా నూర్‌బాషా–దూదేకుల సమాజానికి ప్రత్యేక బడ్జెట్, స్వయం ఉపాధి పథకాలు, సబ్సిడీ రుణాలు, విద్యా సహాయం, నైపుణ్య శిక్షణ, యువతకు ఉపాధి కార్యక్రమాలు అమలు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్పొరేషన్ అంటే కేవలం ఒక కార్యాలయం కాదని, ఒక పేద విద్యార్థికి విద్యా సహాయం, నిరుద్యోగ యువకుడికి నైపుణ్య శిక్షణ, పేద కుటుంబానికి స్వయం ఉపాధి రుణం, మహిళకు ఆర్థిక సాధికారత, సంప్రదాయ వృత్తిదారుడికి ఆధునిక పరికరాలు అందించే వ్యవస్థగా ఉండాలని అన్నారు.
విద్యకు అత్యధిక ప్రాధాన్యత
సమాజ అభివృద్ధికి విద్యే పునాది అని రాజమ్మద్ అన్నారు. నూర్‌బాషా–దూదేకుల విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు, ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం, పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందించాలని కోరారు. ప్రతి జిల్లాలో స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసి, పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువు మధ్యలో నిలిపివేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. “మన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలుగా ఎదగాలి. మన పిల్లలు ఉద్యోగం కోసం మాత్రమే చదవకూడదు.. నాయకత్వం కోసం చదవాలి” అని ఆయన అన్నారు.
యువతకు నైపుణ్య శిక్షణ
నూర్‌బాషా–దూదేకుల యువతలో ప్రతిభకు కొదవ లేదని, వారికి సరైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని రాజమ్మద్ తెలిపారు. ఐటీ, కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానిక్, డ్రైవింగ్, టైలరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, మొబైల్ రిపేరింగ్, డిజిటల్ సర్వీసులు, చిన్న పరిశ్రమలు తదితర రంగాల్లో ప్రత్యేక నైపుణ్య శిక్షణ అందించాలని కోరారు. “చేతిలో సర్టిఫికెట్ మాత్రమే కాకుండా నైపుణ్యం ఉండాలి. ఉద్యోగం కోసం వెతికే యువకుడు.. భవిష్యత్తులో ఉద్యోగం ఇచ్చే యువకుడిగా ఎదగాలి” అని ఆకాంక్షించారు.
స్వయం ఉపాధికి ఆర్థిక సహాయం
పేద కుటుంబాలు చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు సబ్సిడీ రుణాలు, తక్కువ వడ్డీ రుణాలు, మార్కెటింగ్ సదుపాయాలు, శిక్షణ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. చిన్న కిరాణా దుకాణాలు, టైలరింగ్ యూనిట్లు, మెకానిక్ షాపులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, చిన్న పరిశ్రమలు, రవాణా రంగంలో స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహించాలని సూచించారు. “ఒక కుటుంబానికి సరైన ఆర్థిక సహాయం అందితే ఆ కుటుంబం ప్రభుత్వంపై ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడగలదు. అదే నిజమైన ఆర్థిక సాధికారత” అని అన్నారు.
మహిళల ఆర్థిక సాధికారతకు ప్రత్యేక పథకాలు
సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని మహమ్మద్ రాజమ్మద్ పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహాయం, టైలరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, హ్యాండీక్రాఫ్ట్స్, చిన్న వ్యాపారాలపై శిక్షణ, తక్కువ వడ్డీ రుణాలు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. “ఒక మహిళ ఆర్థికంగా ఎదిగితే ఒక కుటుంబం ఎదుగుతుంది.. ఒక కుటుంబం ఎదిగితే ఒక తరం ఎదుగుతుంది” అని అన్నారు. సంప్రదాయ వృత్తులకు ఆధునిక సదుపాయాలు. నూర్‌బాషా–దూదేకుల సమాజంతో అనుబంధం ఉన్న సంప్రదాయ వృత్తులను ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేయాలని ఆయన కోరారు. వృత్తిదారులకు ఆధునిక పరికరాలు, నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్ సదుపాయాలు, ఆన్‌లైన్ మార్కెటింగ్‌పై శిక్షణ కల్పించాలని అన్నారు. ప్రభుత్వ సంస్థల ద్వారా వారి ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పించాలని సూచించారు. “సంప్రదాయ వృత్తి బతికితే ఒక కుటుంబం బతుకుతుంది.. ఆ వృత్తి ఆధునీకరణ చెందితే ఒక సమాజం ఆర్థికంగా బలపడుతుంది” అని పేర్కొన్నారు.
సమగ్ర సామాజిక–ఆర్థిక సర్వే నిర్వహించాలి
నూర్‌బాషా–దూదేకుల సమాజంపై సమగ్ర సామాజిక–ఆర్థిక సర్వే నిర్వహించాలని జేఏసీ డిమాండ్ చేసింది. సమాజ జనాభా, విద్యార్థుల సంఖ్య, నిరుద్యోగులు, పేద కుటుంబాలు, సంప్రదాయ వృత్తులపై ఆధారపడుతున్న కుటుంబాలు, ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు, స్వయం ఉపాధి కోరుకుంటున్న మహిళల వివరాలను సేకరించాలని కోరారు. “సరైన డేటా ఉంటేనే సరైన విధానం రూపొందుతుంది. సరైన విధానం ఉంటేనే సమాజానికి సరైన అభివృద్ధి అందుతుంది” అని రాజమ్మద్ అన్నారు.
రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి
నూర్‌బాషా–దూదేకుల సమాజానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన కోరారు. స్థానిక సంస్థల నుంచి రాష్ట్రస్థాయి బోర్డులు, కమిషన్లు, కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవుల వరకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.“మేము ఎవరి హక్కును తీసుకోవాలని కోరడం లేదు. మాకు రావాల్సిన న్యాయమైన ప్రాతినిధ్యాన్ని మాత్రమే కోరుతున్నాం” అని తెలిపారు.
ప్రభుత్వానికి పది ప్రధాన డిమాండ్లు
1. నూర్‌బాషా–దూదేకుల సమాజం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
2. జీవో నంబర్ 125 అమలుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి.
3. నూర్‌బాషా–దూదేకుల సమాజంపై సమగ్ర సామాజిక–ఆర్థిక సర్వే నిర్వహించాలి.
4. విద్యార్థులకు ప్రత్యేక విద్యా సహాయం, స్కాలర్‌షిప్‌లు, ఉన్నత విద్యా సహాయం అందించాలి.
5. యువతకు ఉచిత పోటీ పరీక్షల కోచింగ్, నైపుణ్య శిక్షణ కల్పించాలి.
6. స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు, తక్కువ వడ్డీ రుణాలు, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు అందించాలి.
7. మహిళల ఆర్థిక సాధికారతకు ప్రత్యేక పథకాలు అమలు చేయాలి.
8. సంప్రదాయ వృత్తులకు ఆధునిక పరికరాలు, శిక్షణ, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి.
9. ప్రభుత్వ బోర్డులు, కమిషన్లు, కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలి.
10. నూర్‌బాషా–దూదేకుల సమాజ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, కాలపరిమితితో కార్యాచరణ ప్రకటించాలి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు నూర్‌బాషా–దూదేకుల సమాజ సమస్యలను ప్రత్యేకంగా పరిగణించి, సమాజ ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని మహమ్మద్ రాజమ్మద్ విజ్ఞప్తి చేశారు. జీవో నంబర్ 125ను పరిశీలించి, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. “అభివృద్ధి అంటే కొంతమంది ఎదగడం కాదు.. వెనుకబడినవారు కూడా ముందుకు రావడమే నిజమైన అభివృద్ధి. నూర్‌బాషా–దూదేకుల సమాజం కూడా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామి కావాలి” అని అన్నారు. సమాజ హక్కుల కోసం పోరాటం శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగుతుందని తెలిపారు. రాజకీయ విభేదాలు, వ్యక్తిగత విమర్శలకు తావులేకుండా సమాజ ప్రయోజనం కోసం అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఐక్యతే మన బలం.. విద్యే మన ఆయుధం.. ఉపాధే మన భవిష్యత్తు.. నూర్‌బాషా–దూదేకుల కార్పొరేషన్ సాధనే మన ప్రధాన లక్ష్యం. కార్పొరేషన్ సాధించే వరకు మా పోరాటం కొనసాగుతుంది” అని మహమ్మద్ రాజమ్మద్ స్పష్టం చేశారు. ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న వారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నసురుద్దీన్, చాంద్ పాషా, సజిత్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు షాజహాన్, మహబూబాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ హుస్సేన్, మహమ్మద్ అబ్దుల్లా, షమీనా బేగం, సలీం, జగిత్యాల జనరల్ సెక్రటరీ మహమ్మద్ రాజ్, ఇబ్రహీం, సభ్యులు అధ్యక్షులు ఇస్మాయిల్, ఇమ్రాన్, అజీముద్దీన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ నిజాముద్దీన్,మల్కాజ్‌గిరి అధ్యక్షులు మహమ్మద్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


