మలిదశ తెలంగాణ ఉద్యమకారుల కుటుంబానికి రూ.10 లక్షల CMRF సాయం
హైదరాబాద్/హనుమకొండ, : తెలంగాణ మలిదశ ఉద్యమంలో అంకితభావంతో సేవలందించిన దివంగత లింగాల కేదారి, ఆయన భార్య దివంగత పుష్పలత కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని శాంతినగర్, పోస్టల్ కాలనీకి చెందిన కేదారి దంపతులు తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో సమాజ సేవలో కీలక పాత్ర పోషించారు. సాధారణ హోటల్ నిర్వహిస్తూ ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం–ఆహారాన్ని వృథా చేయకూడదు’ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు ఉచితంగా భోజనం, టిఫిన్లు, టీలు అందిస్తూ తమ వంతు సేవ చేశారు. లింగాల కేదారి 2026 సెప్టెంబర్ 9న, ఆయన భార్య పుష్పలత సెప్టెంబర్ 10న విషాదకర ఘటనలో మృతి చెందారు. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేదారి దంపతులు తెలంగాణ ఉద్యమానికి, సమాజానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొంటూ CMRF నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎం ఓఎస్డీ ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ మొత్తాన్ని అర్హులైన చట్టబద్ధ వారసులు, కుటుంబ సభ్యులకు అందించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్‌ను అధికారులు ఆదేశించారు. కేదారి దంపతులు ఉద్యమ సమయంలో అందించిన సేవలను గుర్తించి ప్రభుత్వం కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం పట్ల వారి కుటుంబ సభ్యులు, ఉద్యమకారులు కృతజ్ఞతలు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


