బోథ్ కాంగ్రెస్‌లో ‘పట్టణ’ అధ్యక్ష పంచాయితీ
గ్రామాల్లో క్లియర్.. మండల కేంద్రంలోనే తలపోటు!
ఆదిలాబాద్ డెస్క్ (బోథ్) : బోథ్ మండల కాంగ్రెస్ పార్టీలో కమిటీల ఎంపిక ప్రక్రియ ఊహించని మలుపు తిరిగింది. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో రంగంలోకి దిగిన అధిష్టానం.. మండలంలోని అన్ని గ్రామాలకు కమిటీలను ఏకగ్రీవంగానో, లేదా సయోధ్యతోనో ఎంపిక చేసి జాబితాను విడుదల చేసింది. గ్రామాల్లో ఎలాంటి వివాదాలు లేకుండా ప్రక్రియ ముగియడంతో నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.కానీ, అసలు కథ బోథ్ పట్టణ (మండల కేంద్రం) కమిటీ దగ్గరకు వచ్చేసరికి మొదటికొచ్చింది. బోథ్ పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి కోసం ఇద్దరు ముగ్గురు కీలక నేతలు పట్టుబడుతుండటంతో అక్కడ తీవ్ర పోటీ నెలకొంది. ఎవరికి వారు తమకే పదవి దక్కుతుందని ధీమాగా ఉండటమే కాకుండా, తమ అనుచరులతోఅధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.వర్గపోరు భయంతోనే బ్రేక్ పడింది ఏ ఒక్కరి పేరు ప్రకటించినా గ్రూపు రాజకీయాలు పెచ్చరిల్లి, పార్టీ కేడర్‌లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని జిల్లా నాయకత్వం గ్రహించింది. పట్టణంలో గ్రూపుల తగాదాలు మిగతా గ్రామాలపై పడకూడదనే ఉద్దేశంతో, ప్రస్తుతానికి బోథ్ పట్టణ కమిటీ ప్రకటనపై కాంగ్రెస్ పెద్దలు బ్రేక్ వేశారు. అందరినీ కూర్చోబెట్టి, సయోధ్య కుదిర్చిన తర్వాతే తుది పేరును ప్రకటించాలని హైకమాండ్ యోచిస్తోంది. గ్రామాల్లో జోష్ నింపిన కాంగ్రెస్.. మరి ఈ 'బోథ్ పట్టణ' పీఠాన్ని ఎవరికి కట్టబెట్టి ఈ పంచాయితీని ముగిస్తుందో చూడాలి.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


