కాంగ్రెస్ వైఫల్యాలపై దామరకుంటలో బీఆర్‌ఎస్ వినూత్న నిరసన
- * ఇంటింటికీ ‘ప్రభుత్వ బాకీ కార్డుల’ పంపిణీ
- * కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవీ? ప్రజలకు సమాధానం చెప్పాలి
- * అధికారంలో ఉండి ధర్నాలు చేయడం కాంగ్రెస్ దివాళాకోరుతనానికి నిదర్శనం
- * మాజీ ఎంపీటీసీ కృష్ణ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పత్తి బాబు యాదవ్ ధ్వజం
గజ్వేల్/సిద్దిపేట జిల్లా :సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుంట గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రోజు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ, ప్రభుత్వం ప్రజలకు బాకీ పడ్డ పథకాలు, హామీల వివరాలతో కూడిన కార్డులను గ్రామంలోని ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కృష్ణ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పత్తి బాబు యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1000 రోజులు గడుస్తున్నా, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రజలను మోసపూరిత మాటలతో నమ్మించి గద్దెనెక్కిన కాంగ్రెస్ నేడు ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ, తమ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుండడం హాస్యాస్పదంగా, సిగ్గుచేటుగా ఉందని విమర్శించారు. అధికార పార్టీలో ఉన్న నర్సారెడ్డికి నిజంగా దమ్ముంటే ప్రభుత్వంతో మాట్లాడి గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకురావాలని, ఆ పని చేతకాకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని డిమాండ్ చేశారు. గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తప్ప కాంగ్రెస్ పార్టీ కొత్తగా సాధించిందేమీ లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుత పాలనతో విసిగిపోయిన ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని తక్షణమే అమలు చేయాలని బీఆర్‌ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాయత్రి బాల నర్సయ్య, మాజీ ఉప సర్పంచ్ పత్తి ఆంజనేయులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


