1.5 ఎకరాల్లో పత్తి పంట ధ్వంసం..
కన్నీరుమున్నీరవుతున్న రైతు
సారంగాపూర్ :కంటికి రెప్పలా కాపాడుకున్న పంట చేతికి వచ్చే సమయంలో దుండగుల చేతిలో నాశనమవ్వడంతో ఒక రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. పత్తి పంటపై గడ్డిమందు పిచికారీ చేసి పంటను ఎండబెట్టిన ఘటన సారంగాపూర్ మండల కేంద్రంలో వెలుగుచూసింది. సారంగాపూర్ మండల కేంద్రానికి చెందిన రైతు బంగ్లా రాజు రెడ్డి (తండ్రి: ముత్యంరెడ్డి) తన సర్వే నంబర్ 281 లోని 2.5 ఎకరాల భూమిలో పత్తి పంటను సాగు చేస్తున్నాడు. పంట పచ్చగా పెరిగి, చేతికి వచ్చే దశకు చేరింది. గత ఆదివారం రాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు రాజు రెడ్డికి చెందిన చేనులోకి అక్రమంగా ప్రవేశించారు. సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పత్తి పంటపై గడ్డిమందు పిచికారీ చేశారు. మరుసటి రోజు ఉదయం చేను వద్దకు వెళ్లిన రాజు రెడ్డికి పత్తి చెట్లు రంగు మారి ఎండిపోతూ కనిపించాయి. కనుల ముందే పంట నాశనమవ్వడం చూసి బాధితుడు కన్నీరుమున్నీ రయ్యాడు. లక్షల రూపాయలు వెచ్చించి, అహోరాత్రులు కష్టపడి సాగు చేసిన పంటను నాశనం చేసిన దుండగులను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని రాజు రెడ్డి డిమాండ్ చేశాడు. ఈ అమానుష ఘటనపై బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


