షాద్‌నగర్ బస్టాండ్ ఆదాయంలో టాప్.. వసతుల్లో ఫ్లాప్!
- వాణిజ్య అద్దె రూపంలో 10 లక్షల ఆదాయం..
- ప్రయాణికులకు మాత్రం మొండిచేయి
- కుర్చీలు లేవు.. మంచినీళ్లు లేవు.. పారిశుద్ధ్యం అంతంతే
షాద్‌నగర్ : పట్టణంలోని బస్టాండ్ ఆదాయం రోజురోజుకూ పెరుగుతోంది.కానీ ప్రయాణికుల సౌకర్యాలు మాత్రం పడకేశాయి. బస్టాండ్ సముదాయం లోని దుకాణాలు, వాణిజ్య స్థలాల అద్దెల రూపంలో నెలకు సుమారు రూ.10 లక్షల ఆదాయం సమకూరుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. దీనికి తోడు టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం వేరు. ఇంత భారీగా రాబడి ఉన్నా.. కనీస వసతుల కోసం ఖర్చు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణ విస్తరణతో బస్టాండ్‌కు ప్రయాణికుల తాకిడి పెరిగింది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, మహిళలు, వృద్ధులు నిత్యం వేలాదిగా రాకపోకలు సాగిస్తున్నారు. కానీ వారికి అందాల్సిన కనీస సదుపాయాలు కరువయ్యాయి. వెయిటింగ్ హాల్‌లో కుర్చీల కొరత.. వృద్ధులు, మహిళలు గంటల తరబడి నిల్చోవాల్సిన దుస్థితి,తాగునీటి వసతి అంతంతమాత్రం..ఎండాకాలంలో మరింత ఇబ్బంది,పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం.. చెత్తాచెదారం, మరుగుదొడ్ల నిర్వహణ లోపం తీవ్రత ఉందన్నారు. అద్దెల ద్వారా వచ్చే ఆదాయం ఎంత? నిర్వహణ, మరమ్మతులు, పారిశుద్ధ్యానికి ఎంత ఖర్చు చేస్తున్నారు? అన్న వివరాలు అధికారులు బహిర్గతం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆదాయానికి తగ్గట్టు వసతులు కల్పించాలి. కేవలం రాబడి కేంద్రంగా కాకుండా, సేవా కేంద్రంగా బస్టాండ్‌ను తీర్చిదిద్దాలని కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


