ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యం..
క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి CMD జితేష్ వి. పాటిల్ ప్రత్యక్ష పర్యవేక్షణ
హైదరాబాద్: ప్రజలకు మరింత చేరువగా విద్యుత్ సేవలను అందించడంతో పాటు, వినియోగదారుల ఫిర్యాదులను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలనే లక్ష్యంతో TGSPDCL ఆధ్వర్యంలో ‘బస్తీబాట’ కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా TGSPDCL CMD శ్రీ జితేష్ వి. పాటిల్, IAS స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ విద్యుత్ వ్యవస్థను పరిశీలిస్తున్నారు.పర్యటనలో భాగంగా CMD ప్రజలతో నేరుగా మాట్లాడి వారి విద్యుత్ సంబంధిత సమస్యలను తెలుసుకుంటున్నారు. విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులు, స్థానిక సమస్యలు, ప్రమాదకర పరిస్థితులపై ప్రజల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. సమస్యలను ఆలస్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నారు. ముఖ్యంగా ట్రాన్స్‌ఫార్మర్ల పరిసరాలు, డిస్ట్రిబ్యూషన్ బాక్సులు, విద్యుత్ లైన్లు, ఇతర పరికరాలను పరిశీలిస్తూ భద్రతా ప్రమాణాల అమలును సమీక్షిస్తున్నారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి, అవసరమైన మరమ్మతులు, రక్షణ చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులకు సూచిస్తున్నారు.బస్తీబాట కార్యక్రమంలో భాగంగా TGSPDCL అధికారులు కూడా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లు, పరికరాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద భద్రతా లోపాలను గుర్తించి వాటిని సరిచేసే చర్యలు చేపడుతున్నారు. విద్యుత్ పరికరాల రక్షణ, ట్రాన్స్‌ఫార్మర్ పరిసరాల్లో భద్రత, ప్రజలకు ప్రమాదం కలగకుండా అవసరమైన చర్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.“ప్రజలు సమస్యలతో కార్యాలయాలకు వచ్చే వరకు వేచి చూడకుండా.. అధికారులే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరించాలి” అనే లక్ష్యంతో బస్తీబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు TGSPDCL అధికారులు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు, విద్యుత్ ప్రమాదాలను నివారించడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.CMD జితేష్ వి. పాటిల్ ప్రత్యక్ష క్షేత్రస్థాయి పర్యవేక్షణతో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, విద్యుత్ భద్రత, నాణ్యమైన విద్యుత్ సరఫరాపై TGSPDCL మరింత వేగంగా చర్యలు చేపడుతోంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


