మత సామరస్యాలకు అతీతంగా వినాయక చవితి
నిర్వాహకులకు డిఎస్పి సూర్యనారాయణ వినతి
కాటారం (భూపాలపల్లి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సర్కిల్ పరిధిలోని కాటారం, మహా ముత్తారం, కొయ్యూరు (మలహర్) మండలాల పోలీస్ స్టేషన్ల పరిధిలోని వినాయక నవరాత్రి ఉత్సవ కమిటీలు మతసామరస్యాలకు అతీతంగా పండుగలు నిర్వహించుకోవాలని కాటారం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సూర్యనారాయణ కోరారు. శుక్రవారం ఆయన కాటారం సర్కిల్ ఇన్స్ పెక్టర్ నాగార్జున రావు తో కలిసి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల కమిటీ నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ హిందూ, ముస్లింలు, క్రిస్టియన్లు ఎలాంటి గొడవలకు తావు లేకుండా శాంతియుతంగా తమ తమ పండుగలను నిర్వహించుకోవాలని హితవు పలికారు. అలాగే సైబర్ నేరాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ పోస్టర్ ను ఆవిష్కరించారు. వినాయక మండపాల నిర్వాహకులు ముందస్తుగా పోలీసుల నుంచి ఆన్ లైన్ లో అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ నుంచి అనుమతి మేరకు కరెంటు సరఫరా కొనసాగించాలని అన్నారు. మండపాల వద్ద అసభ్యకరమైన, అసాంఘిక కార్యకలాపాలకు చోటు ఇవ్వకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని, లేని ఎడల చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మూడు మండలాల వినాయక నవరాత్రి ఉత్సవాల కమిటీ నిర్వాహకులతో పాటు కొయ్యూరు, మహా ముత్తారం కాటారం ఎస్సైలు మహేందర్ యాదవ్, రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

