అటవీ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.
-.ఎఫ్ డీ ఓ. ప్రథమేస్ కేశవ్ థీజర్
అటవీ, వన్యప్రాణుల సంరక్షణలో వారి సేవలు స్ఫూర్తిదాయకం
ఆదిలాబాద్ జిల్లా : అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆదిలాబాద్ డివిజన్ ఎఫ్‌డీఓ ప్రతమేష్ కేశవ్ తిజారే అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆదిలాబాద్‌లోని మావల పార్కులో ఉన్న అటవీ అమరవీరుల స్తూపం వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఎఫ్‌డీఓ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రెండు అటవీ డివిజన్లకు చెందిన రేంజ్ అధికారులు, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు, ఫీల్డ్, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంద్రవెల్లి రేంజ్ పరిధిలోని దస్నాపూర్ బీట్‌లో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఎఫ్‌బీఓ గౌస్ మొయినుద్దీన్, ఇచ్చోడ రేంజ్‌లో విధి నిర్వహణలో ఉండగా ముల్తానీలో దారుణ హత్యకు గురైన మాంత్యా నాయక్ త్యాగాలను ప్రత్యేకంగా స్మరించుకున్నారు. అమరవీరుల స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణలో అటవీ సిబ్బంది అందిస్తున్న సేవలు ఎంతో కీలకమని ఎఫ్‌డీఓ పేర్కొన్నారు. అమరవీరుల ధైర్యం, అంకితభావం, విధి నిర్వహణ పట్ల నిబద్ధత ప్రస్తుత అటవీ సిబ్బందికి ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


