అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లి కుటుంబంలో తీవ్ర విషాదం
- డీఈసీ కంపెనీ పరిసరాల్లోని గోబర్ గ్యాస్ గుంతలో పడి రెండేళ్ల చిన్నారి మృతి
- భద్రతా లోపమే కారణమంటూ స్థానికుల ఆరోపణలు, విచారణకు డిమాండ్
చిట్యాల : చిట్యాల మండలం ఏపూర్ గ్రామ పరిధిలోని డీఈసీ కంపెనీ వద్ద విషాదం చోటుచేసుకుంది. రాఖీ పండుగ సందర్భంగా అన్న వద్దకు వచ్చిన సోదరికి ఊహించని విషాదం ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన రాజేష్ కుమార్ కొంతకాలంగా డీఈసీ కంపెనీలో పనిచేస్తున్నాడు. రాఖీ పండుగకు అతని సోదరి, ఆమె భర్త అజయ్ పండిట్, వారి కుమారుడు ఆర్యన్ కుమార్(2) కలిసి కంపెనీకి వచ్చారు. శుక్రవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో ఆర్యన్ ఇంటి నుంచి బయటకు వెళ్లి కంపెనీ పరిసరాల్లోకి వెళ్లాడు. కొంతసేపటికి బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించ లేదు. చివరకు మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత కంపెనీ పరిసరాల్లోని గోబర్ గ్యాస్ గుంతలో బాలుడు పడి ఉండటాన్ని గుర్తించి బయటకు తీశారు. అప్పటికే బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కంపెనీ పరిసరాల్లో ప్రమాదకరమైన గుంతలు ఉన్నప్పటికీ రెండేళ్ల చిన్నారి అక్కడికి వెళ్లే పరిస్థితి ఎలా ఏర్పడిందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారులను కంపెనీ పరిసరాల్లోకి ఎలా అనుమతించారనే దానిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాలకు రక్షణ చర్యలు, భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా అనే అంశంపై అధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


