తీరు మారని పశువైద్యశాల
- తాళం వేసి దర్శనమిస్తున్న ఆస్పత్రి..
- మూగజీవాలకు వైద్యం కరువు
- సిబ్బంది ఇష్టారాజ్యంతో రైతులకు తప్పని తిప్పలు
మర్పల్లి,: పాడి పశువులు, మేకలు, గొర్రెలు తదితర మూగజీవాలకు అనారోగ్యం తలెత్తితే సకాలంలో వైద్యం అందించాల్సిన పశువైద్యశాలే రైతులకు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మర్పల్లి మండల కేంద్రంలోని పశువైద్యశాల ఎప్పుడు తెరిచి ఉంటుందో.. ఎప్పుడు తాళం వేసి ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు ఆరోపిస్తున్నారు.మండల కేంద్రంలోని పశువైద్యశాల నిత్యం తాళంతోనే దర్శనమిస్తోందని, సోమవారం మధ్యాహ్నం సుమారు 1 గంటల సమయంలోనూ ఆస్పత్రికి తాళం వేసి ఉండటంతో వైద్యం కోసం వచ్చిన రైతులు నిరాశతో వెనుదిరిగినట్లు తెలిపారు. అత్యవసర సమయంలో పశువులను ఆస్పత్రికి తీసుకొచ్చినా సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని వాపోతున్నారు.పశువైద్య సిబ్బంది తమ ఇష్టానుసారంగా ఆస్పత్రికి వచ్చి వెళ్తున్నారని, కొందరు తమకు డబ్బులు చెల్లించిన వారి పశువుల షెడ్లకు వెళ్లి వైద్యం అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పశువైద్యశాలలో సేవలు అందించాల్సిన సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో అనారోగ్యానికి గురైన పశువులు సకాలంలో చికిత్స పొందలేక మృత్యువాత పడుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పశువులకు వైద్యం, మందులు, చికిత్సకు సంబంధించి సూచనలు అడిగినా సిబ్బంది తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని పశుపోషకులు ఆరోపిస్తున్నారు. సమయానికి ఆస్పత్రిలో ఉండకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. మండల కేంద్రంలోని ఆస్పత్రికే ఈ పరిస్థితి ఉంటే మారుమూల గ్రామాల్లో పశువైద్య సేవలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు.ఈప్పటికే పశుపోష ణపై రైతుల్లో ఆసక్తి తగ్గుతున్న పరిస్థితుల్లో సకాలంలో వైద్యం అందక పశువులు అనారోగ్యానికి గురవుతుండటంతో మరింత నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. మేకలు, బర్రెలు, ఆవులు, ఎద్దులు వంటి పశువులకు అత్యవసర సమయంలో వైద్యం అందకపోతే పశుసంపద తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మర్పల్లి పశువైద్యశాలలో సిబ్బంది విధులకు సక్రమంగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు, రైతులకు అందుబాటులో ఉండేలా వైద్య సేవలను పర్యవేక్షించాలని పశుపోషకులు కోరుతున్నారు. మూగజీవాలకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందించి పశుసంపదను కాపాడాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


