వరి మందు అడిగితే.. పత్తి మందు ఇచ్చారట!
- రెండు ఎకరాల పంట నాశనం.. ఫర్టిలైజర్ షాపుపై రైతు ఆరోపణ
- అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకోలు
బెల్లంపల్లి మంచిర్యాల : వరి పంటలో కలుపు నివారణకు మందు అడిగితే.. పత్తి పంటకు వినియోగించే మందు ఇచ్చారని, దానిని పిచికారీ చేయడంతో రెండు ఎకరాల వరి పంట పూర్తిగా నాశనమైందని కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామానికి చెందిన రైతు కిష్టయ్య ఆరోపించారు. ఈ ఘటనపై వ్యవసాయ అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. కిష్టయ్య, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నామని తెలిపారు. పంటలో గడ్డి, కలుపు పెరగడంతో నివారణ కోసం బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ ఫర్టిలైజర్ దుకాణానికి వెళ్లి వరి పంటకు ఉపయోగించే కలుపు మందు ఇవ్వాలని అడిగామన్నారు. అయితే దుకాణ నిర్వాహకులు పత్తి పంటకు వినియోగించే మందు ఇచ్చారని ఆరోపించారు. తమకు తెలియక ఆ మందును వరి పంటకు పిచికారీ చేశామని, రెండు రోజుల్లోనే పంట మొత్తం దెబ్బతిని చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పెట్టుబడి మొత్తం నష్టపోయామని తెలిపారు. ఈ విషయంపై దుకాణ యజమానిని ప్రశ్నించగా.. తమకు ఎలాంటి సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని రైతు ఆరోపించారు. వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే పంటను పరిశీలించి నష్టం అంచనా వేయాలని, మందు కారణంగానే పంట దెబ్బతిన్నదా అనే అంశంపై విచారణ చేపట్టాలని కోరారు. తమకు జరిగిన పంట నష్టానికి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కిష్టయ్య విజ్ఞప్తి చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


