స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మర్పల్లిలో కాంగ్రెస్ భగ్గుమంది
- తాతా మధు దిష్టిబొమ్మ దహనం.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
- బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన : కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక
మర్పల్లి, : తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అసెంబ్లీ ఆవరణలో అనుచిత పదజాలంతో వ్యాఖ్యలు చేశారంటూ మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం తీవ్ర నిరసన చేపట్టారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మల సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మర్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి తాతా మధు దిష్టిబొమ్మను ర్యాలీగా బస్టాండ్‌కు తీసుకువచ్చారు. అనంతరం నడిరోడ్డుపై దిష్టిబొమ్మను దహనం చేసి బీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మచ్చలేని తమ నాయకుడు, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను అసభ్య పదజాలంతో దూషించడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేవలం ఆయన దళిత నాయకుడు కావడంతోనే అహంకారపూరితంగా ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. స్నేహశీలి, సహృదయుడు, ప్రజల సమస్యలు తెలుసుకుని స్పందించే ప్రజా నాయకుడిగా గడ్డం ప్రసాద్ కుమార్‌కుమంచి గుర్తింపు ఉందన్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ జోలికి వస్తే ఖబడ్దార్.. విడిచిపెట్టేది లేదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. బీఆర్‌ఎస్ పార్టీ అహంకారపూరిత చర్యలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీని భూస్థాపితం చేసే రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు.అనంతరం కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తాతా మధు వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. తాతా మధు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని గడ్డం ప్రసాద్ కుమార్‌కు బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


