తాతా మధును వెంటనే బర్తరఫ్ చేయాలి
- అసెంబ్లీ గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
- మల్లంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీకాంత్ రెడ్డి మల్లంపల్లి,
మల్లంపల్లి (ములుగు) అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనుచితంగా వ్యవహరించడం, దళిత స్పీకర్‌పై అసభ్య పదజాలం ఉపయోగించారనే ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతి నిధులు బాధ్యతారహితంగా వ్యవహరించడం సరికాదని మల్లంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మల్లంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రజలు తమ ప్రతినిధులను అసెంబ్లీకి పంపిస్తారని, అలాంటి సభలో అనుచిత ప్రవర్తనకు పాల్పడటం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదన్నారు. ముఖ్యంగా దళిత స్పీకర్‌ను ఉద్దేశించి అసభ్య పదజాలం ఉపయోగించారనే ఆరోపణలు తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని అన్నారు. అసెంబ్లీ వద్ద మహిళా పోలీసుల పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయని, ప్రజలను మరియు ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించే ప్రతి ఒక్కరూ ఇలాంటి ఘటనలను ఖండించాల్సిన అవసరం ఉందని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. “అసెంబ్లీ అనేది ప్రజల సమస్యలను చర్చించే అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక. అక్కడే ప్రజాప్రతినిధులు అనుచితంగా వ్యవహరిస్తే ప్రజలకు ఎలాంటి సందేశం వెళ్తుంది?” అని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సిన బాధ్యత కలిగిన నాయకులు అసెంబ్లీకి హాజరై తమ వాణిని వినిపించాలని అన్నారు. ప్రజా ప్రతినిధులు తమ బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అసభ్య పదజాలం, అనుచిత ప్రవర్తనకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ తాతా మధుపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆయనను తక్షణమే బర్తరఫ్ చేయాలని మల్లంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు చెరుకుపల్లి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు, అసెంబ్లీ గౌరవం, మహిళా పోలీసుల గౌరవం కాపాడేలా ప్రభుత్వం, సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మల్లంపల్లి సర్పంచ్ ల్యద శ్యామ్ రావు, మెడికల్ అండ్ హెల్త్ వింగ్ జిల్లా అధ్యక్షులు ఆనందపు రవిబాబు, మల్లంపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు పొనుగోటి రవీందర్, వనమా శ్రీనివాస్, కక్కెర్ల సాంబయ్య, లక్ష్మణ్, జింక వేణు, మహేందర్, చంద్రమౌళి, కావటి కుమార్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


