ఎస్‌ఐఆర్‌ నోటీసులతో బెంబేలెత్తుతున్న ఓటర్లు

ఎస్‌ఐఆర్‌ నోటీసులతో బెంబేలెత్తుతున్న ఓటర్లు

  • చిన్నచిన్న వివరాల తేడాలకే నోటీసులు..
  •  సకాలంలో అందించడంలో బీఎల్‌ఓల జాప్యం
  • ఓటు తొలగిస్తారేమోనని ఆందోళన.. అధికారుల పర్యవేక్షణపై విమర్శలు

మర్పల్లి  : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా గత ఎస్‌ఐఆర్‌ వివరాలతో ప్రస్తుత వివరాలు సరిపోలడం లేదంటూ ఓటర్లకు నోటీసులు జారీ చేస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తండ్రి పేరు, వయసు, ఇంటిపేరు, కుటుంబ సభ్యుల వివరాల్లో చిన్నపాటి తేడాలు ఉన్నా సంబంధిత ఓటర్లకు నోటీసులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ ఓటు ఎక్కడ తొలగిపోతుందోనని పలువురు ఓటర్లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గడువు దాటినా అందని నోటీసులు నోటీసులు జారీ చేయాల్సిన బీఎల్‌ఓలు వాటిని ఓటర్లకు సకాలంలో అందించకుండా జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నోటీసులో పేర్కొన్న గడువు ముగిసి ఐదారు రోజులు గడిచినా కొంతమంది ఓటర్లకు నోటీసులు అందడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. దీంతో నోటీసులో కోరిన పత్రాలను సమకూర్చుకుని సంబంధాన్ని రుజువు చేసుకునే విషయంలో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పత్రాల కోసం నానా పాట్లు చిన్నచిన్న వివరాల్లో తేడాలకు సైతం నోటీసులు జారీ చేయడంతో వాటికి సంబంధించిన ఆధారాలు సమర్పించేందుకు ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా కుటుంబ సంబంధాలను నిరూపించేందుకు అవసరమైన పత్రాలను సేకరించడం వృద్ధులు, మహిళలు, గ్రామీణ ప్రాంత ప్రజలకు భారంగా మారిందని వాపోతున్నారు. నోటీసులు సకాలంలో అందితే గడువులోపు ఆధారాలు సమర్పించుకునే అవకాశం ఉంటుందని, ఆలస్యంగా అందితే తాము ఏం చేయాలో అర్థం కావడం లేదని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఎల్‌ఓల నియామకంలో అర్హతలు, విధుల నిర్వహణపై ఉన్నతాధికారులు తగిన పర్యవేక్షణ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు బీఎల్‌ఓలు తమకు నచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారని, ఓటర్ల సందేహాలను నివృత్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి ఓటర్లకు స్పష్టత కల్పించాలని కోరుతున్నారు.రిజిస్టర్లలో నమోదు చేసిన వివరాలను సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి, పత్రాలను సరిచూసిన అనంతరం ఆమోదించాల్సి ఉన్నప్పటికీ ప్రక్రియ తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే ఎస్‌ఐఆర్‌ రిజిస్టర్లలో సంతకాలు చేసి, ఓటరు వచ్చిన తర్వాత బీఎల్‌ఓలు ఆన్‌లైన్‌లో వ్యక్తిగత వివరాలు, సమర్పించిన పత్రాలను నమోదు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు .మండలంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేయడంతో పాటు ప్రతి ఓటరుకు నిర్ణీత గడువులోగా నోటీసులు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అర్హత కలిగిన ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పత్రాల పరిశీలన పారదర్శకంగా నిర్వహించాలని, బీఎల్‌ఓల పనితీరును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై స్పష్టత కల్పించాలని కోరుతున్నారు

Views: 48

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News