తమ్మడపల్లిలో వర్షంలోనూ తగ్గని ఉత్సాహం

తమ్మడపల్లిలో వర్షంలోనూ తగ్గని ఉత్సాహం

  • వైభవంగా ముత్యాలమ్మ బోనాలు
  • ఘనంగా ముగిసిన రెండు రోజుల జాతర ఉత్సవాలు
  • పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో హోరెత్తిన వీధులు

నల్గొండ /మర్రిగూడ:మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక నిష్టాశ్రద్ధలతో ముగిశాయి. వర్షం కురుస్తున్నప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా, ఊరంతా ఒకటై భక్తి పారవశ్యంతో జరిపిన ఈ ఉత్సవాలు మండలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
బోనాల సమర్పణ – అమ్మవారికి ప్రత్యేక పూజలు
ఉత్సవాల్లో భాగంగా గ్రామ ఆడపడుచులు సాంప్రదాయ దుస్తులు ధరించి, మంగళహారతులు, శివసత్తుల పూనకాల నడుమ తలపై బోనాలు ఎత్తుకుని గ్రామ వీధుల గుండా ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ముత్యాలమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. గ్రామానికి ఎలాంటి దిష్టి, ఆపదలు రాకుండా, పాడిపంటలు సమృద్ధిగా పండి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల నామస్మరణతో ప్రతిధ్వనించింది.
మారు బోనం – పోతురాజుల విన్యాసాలు
రెండో రోజు నిర్వహించిన మారు బోనం కార్యక్రమం ఉత్సవాల్లో ప్రధాన ఘట్టంగా నిలిచింది. ఆర్గనైజర్ చెల్లం వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారు. పోతురాజుల భయంకరమైన వేషధారణలు, వారి విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. డీజే చప్పుళ్లు, జానపద కళారూపాలు, డప్పు వాయిద్యాల మోతల మధ్య యువత, మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున డ్యాన్సులు చేస్తూ పురవీధుల్లో నిర్వహించిన ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు.వర్షాన్ని సైతం లెక్కచేయని భక్తజనం పండుగ సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసినప్పటికీ భక్తుల భక్తిశ్రద్ధలు, ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. తడిసి ముద్దవుతున్నా సరే లెక్కచేయకుండా భక్తులు బోనాల ఊరేగింపును కొనసాగించి, లైన్లలో నిలబడి అమ్మవారిని దర్శించుకోవడం వారి నిండైన విశ్వాసానికి అద్దం పట్టింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల సభ్యులు, తమ్మడపల్లి గ్రామస్థులు మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా సాగిన ఈ బోనాల పండుగతో తమ్మడపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం, కోలాహలం నెలకొంది.
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News