ప్రశ్నిస్తే అరెస్టులా?
- ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం..
- సిద్దిపేట జిల్లా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం
హుస్నాబాద్ : ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టేందుకు సిద్ధమైతే కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు నిరాకరించడం సిగ్గుచేటని బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్బంగా శాంతియుత నిరసనకు అనుమతి ఇవ్వకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనను తెలియజేసేందుకు చలో అసెంబ్లీకి పిలుపునివ్వగానే తెల్లవారుజాము నుంచే బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేయించడం చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగా భయపడిపోతుందో అర్థమవుతోందన్నారు. విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతులు రావు.. కానీ ప్రశ్నించే బీజేపీ నాయకులను అరెస్టు చేయడానికి మాత్రం ప్రభుత్వం పోలీసు బలగాలతో సిద్ధంగా ఉంటాయా? అని ఖమ్మం వేంకటేశం ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై పోరాడే గొంతులను అణిచివేయడం ద్వారా ఉద్యమాలను ఆపగలమని కాంగ్రెస్ ప్రభుత్వం పగటి కలలు కనవద్దని హెచ్చరించారు. అరెస్టులతో బీజేపీ ఉద్యమాన్ని ఆపలేరు.. నిర్బంధాలతో ప్రజల గొంతును నొక్కలేరు అని స్పష్టం చేశారు.నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రతిపక్షాల గొంతును అణిచివేసిందో.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అవలంబిస్తోందని విమర్శించారు. పార్టీలు మారాయని,పాలకులు మారారు కానీ ప్రశ్నించే గొంతులను అణిచివేసే కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల తీరు మాత్రం మారలేదు. దొందూ దొందే! అని పద్దతిలో పాలన సాగుతోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా విద్యార్థులను, కళాశాలలను ఇబ్బందులకు గురిచేస్తూ వారి భవిష్యత్తుతో ఆటలాడుతోందని అన్నారు. ఫీజు బకాయిలు చెల్లించడం ప్రభుత్వ ఉపకారం కాదు.. విద్యార్థుల హక్కు. ఆ హక్కు కోసం బీజేపీ చివరి వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు.ముందస్తు అరెస్టులతో బీజేపీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే అది కాంగ్రెస్ ప్రభుత్వ భ్రమ మాత్రమేనని, ఒక్క నాయకుడిని అరెస్టు చేస్తే వందలాది గొంతులు ప్రశ్నిస్తాయని.. వందల గొంతులను అరెస్టు చేస్తే వేలాది మంది రోడ్డెక్కుతారని హెచ్చరించారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొండివైఖరి వీడి ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ముందస్తు అరెస్టులు చేసిన బీజేపీ, బీజేవైఎం నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం బీజేపీ ఆధ్వర్యంలో మరింత ఉధృతమైన ప్రజా ఉద్యమాన్ని చేపడతామని ఖమ్మం వేంకటేశం తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


