జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి
హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థకు సంబంధించిన జీవో నంబర్ 97 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ నగర కార్యదర్శి బత్తుల రాజు డిమాండ్ చేశారు.మంగళవారం రోజున ఏబీవీపీ తలపెట్టిన పాలిటెక్నిక్ కళాశాల రాష్ట్రవ్యాప్త బంద్ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బత్తుల రాజు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్య అనేది పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు సాంకేతిక విద్యతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు మార్గం చూపుతున్న కీలకమైన విద్యా వ్యవస్థ. అలాంటి వ్యవస్థకు సంబంధించి విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపే నిర్ణయాలను ప్రభుత్వం పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.జీవో 97 అమలుతో పాలిటెక్నిక్ విద్యార్థుల విద్యా ప్రమాణాలు, భవిష్యత్ ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు మరియు సాంకేతిక విద్యా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు విద్యా రంగానికి చెందినవారి అభిప్రాయాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండా ఇలాంటి నిర్ణయాలు అమలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇప్పటికే అధ్యాపకుల కొరత, మౌలిక సదుపాయాల సమస్యలు, ప్రయోగశాలలు మరియు ఆధునిక సాంకేతిక పరికరాల కొరత వంటి సమస్యలు ఉన్న నేపథ్యంలో, విద్యార్థులపై అదనపు ప్రభావం చూపే విధానాలను అమలు చేయడం వల్ల వారి భవిష్యత్తు మరింత అనిశ్చితిలో పడే ప్రమాదం ఉందన్నారు.కాబట్టి ప్రభుత్వం GO 97ను తక్షణమే రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యను మరింత బలోపేతం చేసే విధంగా సమగ్ర విధానాన్ని రూపొందించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, తల్లిదండ్రులు మరియు విద్యావేత్తలతో విస్తృతంగా చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకోవాల న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా హాస్టల్స్ కన్వీనర్ రాజేష్,జిల్లా ఎస్ ఎఫ్ డి కన్వీనర్ చరణ్, నగర ఉపాధ్యక్షులు సంతోష్ నగర సంయుక్త కార్యదర్శి రంజిత్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


