సాగునీరు ఇవ్వకపోతే రైతులకు తీవ్ర నష్టం
- ప్రభుత్వం వెంటనే స్పందించాలి: కడియం వెంకటరెడ్డి
- మహాధర్నాను జయప్రదం చేయండి: కడియం వెంకటరెడ్డి
గరిడేపల్లి : సాగర్ ఎడమ కాలువ పరిధిలో సాగు చేస్తున్న రైతుల పంటలను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే సాగునీటిని విడుదల చేయాలని హుజూర్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. మంగళ వారం గరిడేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగు పంటలు కీలక దశలో ఉన్న సమయంలో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాలు అనుకూలంగా లేకపోవడంతో పాటు బోర్లు, బావుల్లో నీటిమట్టాలు తగ్గిపోయాయని, దీంతో సాగర్ ఎడమ కాలువ నీటిపైనే వేలాది మంది రైతులు ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు. సకాలంలో నీరు అందకపోతే రైతులు పెట్టిన పెట్టుబడులతో పాటు పంటలు కూడా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సాగర్ ఎడమ కాలువకు తక్షణమే నీటిని విడుదల చేయడంతో పాటు వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే పంటలు ఎండిపోయి రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. రైతుల డిమాండ్ల సాధన కోసం నేరేడుచర్ల ప్రధాన రహదారిపై నేడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గరిడేపల్లి మండలంలోని రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, పార్టీ సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సర్వారం పీఏసీఎస్ మాజీ చైర్మన్ వీరం రెడ్డి శంబిరెడ్డి, మాజీ మండల ప్రధాన కార్యదర్శి మన్సూర్ అలీ, పెండెం ధనయ్య గౌడ్, బండ్ల గోపాల్, కానుగ నగేష్, పెండెం వినోద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


