బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సహాయం
మృతులకు నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్ బి. గీతే
 

వేములవాడ : చందుర్తి మండలం లింగంపేట గ్రామ పరిధిలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన షాదుల్లా కుటుంబం వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రక్తసంబంధీకులు మృతి చెందడం తీవ్ర విషాదకరమన్నారు. మృతుల్లో షాదుల్లాతో పాటు ఆయన భార్య హాసీనా, మరో హాసీనా, పదో తరగతి చదువుతున్న చిన్నారి ఉన్నారని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఒక్కొక్కరుగా మృతి చెందారని పేర్కొన్నారు. సోమవారం వేములవాడ ఏరియా ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే పరామర్శించి ఓదార్చారు. మృతదేహాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు అవస రమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ముందు, వెనుక సీట్లలో ప్రయాణించే వారంతా సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు. వాహనాలను అతివేగంగా నడపకుండా అప్రమత్తంగా ప్రయాణించాలని కోరారు. ప్రయాణికుల భద్రతపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరూ తమ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకుని సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని సూచించారు. ఒకే ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రక్తసంబంధీకులు మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆది శ్రీనివాస్ అన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు బాధ్యతగా పాటించాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించి వేగ నియంత్రణ పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. 
Views: 13

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags: