యాప్‌ల పేరుతో రైతుల మెడకు ఉరి తాడు..!

ఎరువులు కావాలంటే యాప్‌లో నమోదు చేసుకోవాలా?

యాప్‌ల పేరుతో రైతుల మెడకు ఉరి తాడు..!

  • యాప్‌లు బంద్ చేసి ఎరువులు ఇవ్వాలి..
  • లేదంటే వ్యవసాయం బంద్ చేసే పరిస్థితులు వస్తాయి: శ్రీనివాస్ రెడ్డి

 

అక్కన్నపేట,: రైతులను యాప్‌లు, ఆంక్షల పేరుతో ఇబ్బందులకు గురిచేయడం వెంటనే నిలిపివేసి, ఎలాంటి షరతులు లేకుండా ఎరువులు అందించాలని ఎంసీపీఐ(సి) సిద్ధిపేట జిల్లా అనుబంధ రైతు సంఘం జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దేశానికి అన్నం పెట్టే రైతులపైనే ఎందుకింత ఆంక్షలు విధిస్తున్నారని ఆయనహ్ ప్రశ్నించారు. తెల్లవారుజామునే లేచి పాలు పితికి ప్రజలకు పాలు, పెరుగు, మజ్జిగహ్ అందించడం నుంచి కూరగాయలు, వరి పండించి ప్రతి కుటుంబానికి ఆహారం అందించడం వరకు రైతు చేస్తున్న సేవలకు పాలకులు ఇచ్చే బహుమతి ఇదేనా అని నిలదీశారు.

యాప్‌లో మెసేజ్ వచ్చేలోపే ఎరువులు నో స్టాక్

వ్యవసాయ అధికారి ఉదయం 9.35 గంటలకు యూరియా అందుబాటులో ఉందని మెసేజ్ పంపితే అది ఎంతమంది రైతులకు సకాలంలో చేరుతుందని శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. మెసేజ్ తెలుసుకునేలోపే దుకాణాల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తే రైతు పరిస్థితి ఏమిటని నిలదీశారు. ఒక ప్రభుత్వం ఒక యాప్ తీసుకురావడం, మరో ప్రభుత్వం మరో యాప్‌తో ముందుకు రావడం వల్ల చదువుకోని, సాంకేతిక పరిజ్ఞానం లేని రైతులు ఏం చేయాలని ప్రశ్నించారు. రైతు వ్యవసాయం బంద్ చేస్తే దేశం ఏం తింటుంది? ఇప్పటికే వర్షాలు సకాలంలో లేక పంటలు పండక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మరోవైపు పిల్లల చదువుల ఫీజులు, అనారోగ్యంతో మంచాన పడిన తల్లిదండ్రుల మందులు, చేసిన అప్పులు, బ్యాంకు రుణాలు ఎలా తీర్చాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. రైతు బంధు సాయం సకాలంలో అందక, ఇన్ని కష్టాల మధ్య రైతు ప్రాణాలు కోల్పోతే రైతు బీమా కూడా అందని పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. రైతును ‘రైతు రాజు’గా చూస్తామని చెప్పే పాలకులు కనీసం రైతును రైతుగా బతికే పరిస్థితి కల్పించడం లేదని విమర్శించారు. రైతును తిప్పలు పెడితే ఆ పాపం ఊరికే పోదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి యాప్‌ల పేరుతో విధిస్తున్న ఆంక్షలను తొలగించి, రైతులకు అవసరమైన ఎరువులను నేరుగా అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులు వ్యవసాయం బంద్ చేసే పరిస్థితులు కూడా రావచ్చని శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.

Views: 101

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News