అవినీతికి కేరాఫ్ అడ్రస్గా ఇందూర్ కార్పొరేషన్
- ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ధ్వజం
- మహేష్ కుమార్ గౌడ్ చేతకాకపోతే మేయర్‌తో రాజీనామా చేయించండి..
- కేంద్రం నుంచి వేల కోట్లు తెస్తాం : దినేష్ పటేల్ కులాచారి
నిజామాబాద్ : ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, బీజేపీ ఫ్లోర్ లీడర్ వి. ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ధర్నా చౌక్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ అవినీతికి కేరాఫ్ అడ్రస్గా ఇందూర్ కార్పొరేషన్ మారిందని, ప్రతి బడ్జెట్ మీటింగ్ లో కోట్లు కేటాయిస్తారు కానీ పనుల కోసం రూపాయి ఖర్చు చేయడం లేదన్నారు. అభివృద్ధి కోసం ఒక ఎమ్మెల్యే గా ఉండి కూడా ధర్నా చేస్తున్నానంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. కార్పొరేషన్లు 150 కోట్ల ఆదాయం, 94 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నా ఒక్క రూపాయి ఖర్చు చేయకపోవడం సిగ్గుచేటున్నారు. పదేళ్లు బీఆర్ఎస్ పాలించినా..మేయర్ వాళ్లే ఉన్నా అభివృద్ధి చేయలేకపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తుందని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అభివృధ్ధి కొరకు 200 కోట్లు మంజూరు చేస్తామని చెప్పి ఇప్పటివరకు విడుదల చేయలేరన్నారు. ప్రభుత్వంలో ఉండి కూడా ఇక్కడి మేయర్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నారు. నిజామాబాద్ ప్రజలకు నిధులు కాగితాలపై కనిపించడం అవసరం లేదు. ఆ నిధులతో చేసిన రోడ్డు కనిపించాలి, నిర్మించిన డ్రైనేజీలు కనిపించాలి, వెలిగే దీపాలు కనిపించాలన్నారు. కమిషనర్ కు అనేకసార్లు కలిసి లేఖలు అందించినా స్పందించకపోవడం తగదన్నారు. బడ్జెట్ లో డివిజన్ల అభివృద్ధి కొరకు 35 కోట్లు కేటాయించినా..ఇప్పటి వరకు ఒక్క డివిజన్ కు కూడా రూపాయి కేటాయించలేదన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ గత ఏడు నెలలుగా మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడంతో దోమలు ప్రబలి, ప్రజారోగ్యం క్షీణించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీధి కుక్కల బెడద తీవ్రమై ప్రజలను కరుస్తున్నాయి. కాంగ్రెస్ కుక్కలకు చెబుతున్నాం నెల రోజుల్లోగా ఈ కుక్కలను పట్టుకోకపోతే, వాటన్నింటినీ మహేష్ కుమార్ గౌడ్ గారి ఇంట్లోకి వదులుతామని హెచ్చరించారు. విలీన గ్రామాల డివిజన్లలో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. సమస్యలు పరిష్కరించాలని అడిగితే... 'నేను వన్ టైమ్ ఎమ్మెల్యేని మాత్రమే' అని తప్పించుకునేలా మాట్లాడుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ బల్దియా సమస్యలను పరిష్కరించడం చేతకాకపోతే మీ మేయర్‌తో రాజీనామా చేయించు! నగరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు కావాలో ప్రతిపాదనలు పంపించు. 100 కోట్లు కావాల్నా, 1000 కోట్లు కావాల్నా ప్రపోజల్స్ పంపిస్తే... కేంద్రం నుండి ఎన్ని వేల కోట్ల నిధులైనా తీసుకురావడానికి మా ఎంపీ, ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారు. కార్పొరేషన్ ముట్టడి.. ఉద్రిక్తత.. బల్దియా సమస్యల పరిష్కారానికి, కమిషనర్ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ధర్నాచౌక్లో ధర్నా అనంతరం కార్పొరేషన్ కార్యాలయ ముట్టడికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులు, బిజెపి కార్పొరేటర్లు మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారా యణ , జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ పటేల్ కులాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ వచ్చే వరకు జరిగేది లేదని హెచ్చరించి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు బైఠాయించారు. అనంతరం కమిషనర్ దిలీప్ కుమార్ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో 28 మంది బీజేపీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, మోర్చాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


