ఏజెన్సీ ఎస్సీల హక్కులు కాపాడాలి
భూమి, రాజకీయ రిజర్వేషన్లు, ఉద్యోగాలు, ఇళ్ల స్థలాలు కల్పించాలి: మంత్రి వివేక్‌కు జేఏసీ వినతి
వెంకటాపురం : ఏజెన్సీ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తున్న ఎస్సీల సమస్యలను పరిష్కరించి, వారికి చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ డిమాండ్ చేసింది. భూమి హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు, ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరింది. జేఏసీ రాష్ట్ర కన్వీనర్, సమతా సైనిక దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ దుర్గం నగేష్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసి వినతిపత్రం అందజేసింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో ఎస్సీ కుటుంబాలు సుమారు 130 ఏళ్లుగా నివసిస్తున్నా ఇప్పటికీ అనేక సమస్యలు పరిష్కారం కాలేదని నగేష్ తెలిపారు.
సాగు చేస్తున్నా.. పట్టాలు లేవు
1950కి ముందు నుంచే పరంబోకు, ఖారిజ్‌ఖాతా, ఇనాం భూములను సాగు చేస్తున్న ఎస్సీ కుటుంబాలకు చట్టబద్ధమైన పట్టాలు లేకపోవడంతో రైతు భరోసా, బ్యాంకు రుణాలు తదితర ప్రయోజనాలు అందడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రత్యేక సర్వే నిర్వహించి, అర్హత ఉన్న వారికి భూమిపై హక్కులు కల్పించాలని కోరారు.
భూ బదిలీలకు ఆటంకాలు
ఏజెన్సీ ప్రాంతాల్లో అమలులో ఉన్న భూ బదలాయింపు నిబంధనల కారణంగా ఎస్సీ కుటుంబాల్లో వారసత్వ బదిలీలు, కుటుంబ విభజనలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. గిరిజనుల భూ హక్కులకు భంగం కలగకుండా, ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎస్సీల సమస్యలకు చట్టపరమైన పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
ఇంటి స్థలాలు, ఇళ్లు ఇవ్వాలి
పలు దళిత బస్తీల్లో నివాస స్థలాల కొరత తీవ్రంగా ఉందని జేఏసీ తెలిపింది. అర్హులైన ప్రతి ఎస్సీ కుటుంబానికి ఉచిత ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరింది.
ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలి
స్థానిక స్థాయి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీలకు వర్తించే రిజర్వేషన్ ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక నియామకాల్లో అవకాశాలు తగ్గడంతో ఎస్సీ యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు.
సీఎం దృష్టికి తీసుకెళ్తా: వివేక్
జేఏసీ ప్రతినిధులు వివరించిన సమస్యలపై మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వ స్థాయిలో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బద్దం డానియల్, మేకల రవీందర్, కోలా శ్యామ్, మండల రాహుల్, ముడిమడుగుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


