మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: డా. మౌనిక
కాటారం (భూపాలపల్లి): “నషా ముక్త్ యువ – వికసిత్ భారత్ 2026” కార్యక్రమంలో భాగంగా కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ట్రైబల్ గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైద్యాధికారి డా. మౌనిక మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం యువత ఆరోగ్యం, విద్యాభ్యాసం, మానసిక స్థితి, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. చెడు స్నేహాలు, ప్రలోభాలు, ఒత్తిళ్లకు లోనుకాకుండా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్ కారణంగా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గడం, ప్రవర్తనలో మార్పులు, మానసిక సమస్యలు, వ్యసనం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని క్రీడలు, విద్య, సృజనాత్మక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. “డ్రగ్స్‌కు నో.. జీవితానికి యెస్” అనే సందేశాన్ని పాటిస్తూ సమాజంలోనూ మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్ బి ఎస్ కె మెడికల్ ఆఫీసర్ బండి శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎం ప్రీతి, ఆశ కార్యకర్త స్వరూప రాణి, విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


