రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం న్యాయపోరాటం
విద్యార్థులు, యువత భవిష్యత్తు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బుట్టెంగారి మాధవరెడ్డి
అక్కన్నపేట,: విద్యార్థులు, యువత భవిష్యత్తుతో పాటు వివిధ సామాజిక వర్గాలకు రాజ్యాంగబద్ధంగా లభించే హక్కులు, అవకాశాల పరిరక్షణ లక్ష్యంగా న్యాయపోరాటం కొనసాగిస్తున్నట్లు రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టెంగారి మాధవరెడ్డి తెలిపారు. రిజర్వేషన్ల అమలు, ప్రభుత్వ నిర్ణయాలు, సామాజిక వర్గాల హక్కులకు సంబంధించిన అంశాల్లో రాజ్యాంగ పరిమితులు, చట్టపరమైన నిబంధనలు పాటించాలనే ఉద్దేశంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎవరూ ముందుకు రాని సమయంలోనూ తాను న్యాయపరమైన మార్గంలో ముందుకు సాగుతున్నానని మాధవరెడ్డి తెలిపారు. తనపై వచ్చే ఒత్తిళ్లు, విమర్శలను పట్టించు కోకుండా రాజ్యాంగబద్ధమైన హక్కుల పరిరక్షణ కోసం న్యాయపోరాటం కొనసాగిస్తున్నట్లు చెప్పారు. రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో 50 శాతం పరిమితిని ప్రస్తావించిన విషయం తెలిసిందే. అయితే రిజర్వేషన్ అంశాల్లో వర్తించే రాజ్యాంగ నిబంధనలు, రిజర్వేషన్ స్వభావం, ప్రత్యేక పరిస్థితులు, సంబంధిత కేసు వాస్తవాల ఆధారంగా న్యాయపరమైన అంశాలు మారవచ్చని ఆయన పేర్కొన్నారు. తన న్యాయపోరాటం వ్యక్తిగత పదవులు లేదా ప్రచారం కోసం కాదని, భవిష్యత్ తరాల విద్యార్థులకు సమాన అవకాశాలు, యువతకు అందాల్సిన అవకాశాలు, సామాజిక వర్గాల రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య వ్యవస్థలో సముచిత ప్రాతినిధ్యం వంటి అంశాలపై చట్టపరమైన పరిష్కారం కోసం చేస్తున్న ప్రయత్నమని మాధవరెడ్డి తెలిపారు హక్కుల కోసం ప్రశ్నించడం, న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఆయన పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవిస్తూ, న్యాయస్థానాలపై విశ్వాసంతో ఈ న్యాయపోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. రాబోయే తరాలకు సమాన అవకాశాలు, విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు, ప్రతి వర్గానికి రాజ్యాంగబద్ధమైన హక్కులు, ప్రాతినిధ్యం ఉండేలా చట్టపరమైన పరిష్కారాల కోసం తన ప్రయత్నం కొనసాగుతుందని బుట్టెంగారి మాధవరెడ్డి వెల్లడించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


