తెగలే.. తేలలే..!
- ఉద్యోగుల డిమాండ్లపై రాని స్పష్టత
- సీఎస్‌తో జేఏసీ నేతల చర్చలు అసంపూర్తి
- పీఆర్సీ, డీఏలు, సీపీఎస్ రద్దుపై జేఏసీ పట్టు
- పెండింగ్ బిల్లులకు నెలకు రూ.2 వేల కోట్లు విడుదల చేయాలి
- నేడు డిప్యూటీ సీఎంతో చర్చల తర్వాత నిర్ణయం
తీవ్ర అసంతృప్తిలో ఉద్యోగులు: కళాధర్ రెడ్డి
అక్కన్నపేట,: లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూసిన ప్రభుత్వం–జేఏసీ చర్చలు ఎలాంటి స్పష్టమైన నిర్ణయం లేకుండానే అసంపూర్తిగా ముగిశాయని ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు కళాధర్ రెడ్డి అన్నారు. పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఈహెచ్‌ఎస్ అమలు తదితర ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైందన్నారు.
పీఆర్సీపై స్పష్టత ఏదీ?
రాష్ట్ర సచివాలయంలో సోమవారం సీఎస్ సంజయ్ జాజుతో జేఏసీ నేతలు సమావేశమయ్యారని కళాధర్ రెడ్డి తెలిపారు. పీఆర్సీ అమలుపై జేఏసీ నేతలు ప్రశ్నించగా, పీఆర్సీ నివేదికను త్వరలో తెప్పించుకుని పరిశీలించిన అనంతరం క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీఎస్ తెలిపినట్లు పేర్కొన్నారు. దీంతో పీఆర్సీ అమలుపై ఉద్యోగులకు తక్షణ స్పష్టత లభించలేదన్నారు.
డీఏలు.. పెండింగ్ బిల్లులపై పట్టు
పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని కోరినట్లు కళాధర్ రెడ్డి తెలిపారు. అలాగే పెండింగ్ బిల్లుల కోసం ప్రతి నెల రూ.2 వేల కోట్లు విడుదల చేయాలని, అందులో 50 శాతం ఉద్యోగులకు, 50 శాతం పెన్షనర్లకు కేటాయించాలని కోరినట్లు చెప్పారు.
సీపీఎస్ రద్దుపై కమిటీ ప్రతిపాదన
సీపీఎస్ రద్దు అంశంపై మూడు నెలల పాటు అధ్యయనం చేసేందుకు సుమారు ఎనిమిది మందితో కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించినట్లు కళాధర్ రెడ్డి తెలిపారు. అయితే ఉద్యోగులు మాత్రం సీపీఎస్‌ను తక్షణమే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎంతో చర్చల తర్వాత నిర్ణయం
ఉద్యోగుల ప్రధాన డిమాండ్లపై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో చర్చించిన అనంతరం మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటామని సీఎస్ తెలిపినట్లు కళాధర్ రెడ్డి అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తిరుపతిలో ఉండటంతో తదుపరి చర్చలను మంగళవారం సాయంత్రానికి వాయిదా వేసినట్లు తెలిపారు. డిప్యూటీ సీఎంతో సీఎస్ చర్చించి అనంతరం జేఏసీతో సమావేశమవుతారా, లేక నేరుగా జేఏసీ నేతలతో చర్చలు జరుగుతాయా అన్నదానిపై స్పష్టత లేదన్నారు.
రెండుసార్లు వాయిదా.. మళ్లీ అసంపూర్తి
ప్రభుత్వం–జేఏసీ మధ్య జరగాల్సిన చర్చలు ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డాయని కళాధర్ రెడ్డి తెలిపారు. తొలుత సెప్టెంబర్ 18న జరగాల్సిన చర్చలు అసెంబ్లీ సమావేశాల కారణంగా సెప్టెంబర్ 21కి వాయిదా పడ్డాయని, సోమవారం జరిగిన చర్చలు కూడా పూర్తిస్థాయిలో జరగకపోవడంతో మళ్లీ మంగళవారానికి వాయిదా పడ్డాయని పేర్కొన్నారు.
హామీలు రాకపోతే ఉద్యమబాట
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ప్రధాన సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కళాధర్ రెడ్డి డిమాండ్ చేశారు. పీఆర్సీ, డీఏలు, సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల చెల్లింపు వంటి అంశాలపై ఇక జాప్యం చేయకుండా స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలన్నారు. ప్రభుత్వం చర్చలు జరిపి హామీలను అమలు చేయకపోతే జేఏసీ ఆధ్వర్యంలో తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


