శక్తి పాలసీపై పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన

శక్తి పాలసీపై పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన

  • మూడో రోజుకు చేరిన ఆందోళనలు
  • పోలీస్ బందోబస్తు – జీవో 97 రద్దుకు డిమాండ్త
  • రగతులు బహిష్కరించడంతో కళాశాలలో విద్యా కార్యకలాపాలు

చౌటకూర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన "శక్తి విధానం" మరియు జీవో నంబర్ 97ను వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట (హొన్నపూర్ – జోగిపేట) ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు చేపట్టిన నిరసన బుధవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. పాలిటెక్నిక్, ఐటీఐ తదితర వృత్తి విద్యా సంస్థలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు తరగతులను పూర్తిగా బహిష్కరించి, కళాశాల ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు.
విద్యార్థుల ప్రధాన అభ్యంతరాలు:
డిప్లొమా ఉనికికి ముప్పు: దశాబ్దాలుగా ప్రత్యేక సాంకేతిక విద్యా గుర్తింపు ఉన్న పాలిటెక్నిక్ డిప్లొమా ఇంజనీరింగ్‌ను కేవలం సాధారణ నైపుణ్య శిక్షణ కోర్సుల స్థాయికి కుదిస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత విద్యా అవకాశాలకు గండి: విలీనం కారణంగా బీటెక్ ప్రవేశాల కోసం నిర్వహించే (ఈసెట్) అర్హత, లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు దెబ్బతింటాయని విద్యార్థులు భయపడుతున్నారు. కోర్సు నిర్మాణం, పరీక్షల్లో గందరగోళం: విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలతో సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా కార్మిక, శిక్షణ విభాగాల పరిధిలోకి మార్చడం విద్యా ప్రమాణాలను దెబ్బతీస్తుందని పేర్కొంటున్నారు. లెక్చరర్ల మద్దతు – "మా డిప్లొమా.. మా ఐడెంటిటీ" నినాదాలు విద్యార్థుల ఆందోళనకు కళాశాల లెక్చరర్లు సైతం నల్లబ్యాడ్జీలు ధరించి మద్దతు పలికారు. "మా డిప్లొమా.మా ఐడెంటిటీ.. మాకు న్యాయం కావాలి" అంటూ విద్యార్థులు ప్లకార్డులతో నినదించారు. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం వల్ల కోర్సుల నాణ్యత, పరీక్షల నిర్వహణ ప్రమాణాలు పడిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై ఉద్రిక్తత – పోలీసుల జోక్యం ఆందోళనలో భాగంగా విద్యార్థులు సంగారెడ్డి-నాందేడ్-అకోలా (NH-161) జాతీయ రహదారిపై రాస్తారోకోకు యత్నించగా, జోగిపేట సీఐ అనిల్ కుమార్ అక్కడికి చేరుకుని అనుమతి లేదని వారిని నిలువరించారు. అనంతరం సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కళాశాల ఆవరణలోనే శాంతియుతంగా నిరసన తెలపాలని సూచించారు. అనంతరం విద్యార్థులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసేందుకు తరలివెళ్లారు. పోలీస్ బందోబస్తు – జీవో 97 రద్దుకు డిమాండ్త రగతులు బహిష్కరించడంతో కళాశాలలో విద్యా కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కళాశాల పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవో నంబర్ 97ను ఉపసంహరించుకునే వరకు తమ ఆందోళనను విరమించే ప్రసక్తే లేదని విద్యార్థులు స్పష్టం చేశారు. 
 
sANG- POLC
Views: 31

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News