బరితెగించిన భూబకాసురులు.
- చింతకుంటలో ఇందిరమ్మ ఇళ్ల ప్రభుత్వ గుట్ట భూమి ఆక్రమణ!
- రాజకీయ అండదండలతో యథేచ్ఛగా ఇంటి నిర్మాణ పనులు
- సర్వే నెంబర్ 439లో చెట్లను నరికేసి గుట్టల చదును
- ప్రశ్నించిన స్థానికులపై కబ్జాదారుల దౌర్జన్యం.. బెదిరింపులు!
- లక్షలాది రూపాయల ఆస్తి హారతి అవుతున్నా నిమ్మకు నీరెత్తిన అధికారులు
కొత్తపల్లి : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణా లోపాన్ని ఆసరాగా చేసుకుని కబ్జాదారులు చెలరేగిపోతున్నారు. తాజాగా 15వ డివిజన్ పరిధిలోని చింతకుంట ప్రగతి నగర్‌లో ఉన్న ప్రభుత్వ మిగులు భూమి కబ్జాకు గురవుతోంది. ఇక్కడి సర్వే నెంబర్ 439లో ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించిన ప్రభుత్వ మిగులు గుట్ట భూమిని కార్పొరేటర్ ముఖ్య అనుచరుడు ఒకరు అక్రమంగా ఆక్రమించి, ఇంటి నిర్మాణ పనులు చేపట్టడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండటంతో సదరు కబ్జాదారుడు పట్టపగలే గుట్టలను చదును చేసి చెట్లను నరికివేస్తూ అడ్డూఅదుపూ లేకుండా వ్యవహరిస్తున్నాడు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు, ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడాల్సిన గుట్ట భూమిని జేసీబీలతో పట్టపగలే చదును చేశారు. ఈ క్రమంలో అక్కడున్న పచ్చని వృక్షాలను, పెద్ద పెద్ద చెట్లను యథేచ్ఛగా నరికివేశారు. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తూ, కొండలను తవ్వేసి ప్రహరీ గోడలు, పునాదుల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించడమే కాకుండా, కబ్జాను ప్రశ్నించిన స్థానిక కాలనీ వాసులపై కబ్జాదారుడు, అతని అనుచరులు తీవ్ర దౌర్జన్యానికి దిగుతున్నారు. మా వెనుక పెద్ద నాయకులు ఉన్నారు. మమ్మల్ని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి అంటూ స్థానికులను దుర్భాషాలాడుతూ , చంపుతామని బెదిరింపులకు గురిచేస్తున్నారు. కబ్జాదారుల అరాచకాలు, బెదిరింపులతో కాలనీ వాసులు తీవ్ర భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. కళ్లముందే లక్షల రూపాయల విలువ చేసే ప్రభుత్వ గుట్ట భూమి ప్రైవేటు వ్యక్తుల పరం అవుతున్నా, పచ్చని చెట్లను కూల్చేస్తున్నా, స్థానికులను బెదిరిస్తున్నా సంబంధిత నగరపాలక సంస్థ (కార్పొరేషన్) టౌన్ ప్లానింగ్ అధికారులు గానీ, రెవెన్యూ యంత్రాంగం గానీ అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కలిగిన అధికారులే చేష్టలుడిగి చూస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ తక్షణమే స్పందించి, చింతకుంట ప్రగతి నగర్ సర్వే నెంబర్ 439లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. గుట్ట భూమిని స్వాధీనం చేసుకుని, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ స్థానికులను బెదిరిస్తున్న కబ్జాదారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
Views: 103
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
06 Aug 2026 17:36:34
నిజామాబాద్ :నిజామాబాద్ తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి నివాళులు...
