రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
- హామీలు కొండంత.. అమలు శూన్యం
- పంటలకు బోనస్ లేదు.. గిట్టుబాటు ధర లేదు.. రైతన్నకు మిగిలింది కన్నీరే
- సంక్షోభంలో వ్యవసాయ రంగం... రైతులకు అండగా బీఆర్ఎస్
- మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
- కాంగ్రెస్ 1000 రోజుల విధ్వంస పాలనపై బీఆర్ఎస్ చార్జ్‌షీట్
షాద్ నగర్ :కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టిందని, ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్నదాతలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కొందుర్గ్ మండల కేంద్రంలోని జి.ఎం. పటేల్ గార్డెన్‌లో ఆయన ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి వ్యవసాయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను బీఆర్ఎస్ నాయకులు వివరించారు. వరంగల్ డిక్లరేషన్‌లో రైతులకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని విమర్శించారు. రైతులకు రైతు భరోసా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. రూ.50 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ హామీని కూడా నీరుగార్చారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు అందిన రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం రైతులకు కనీసం పది గంటల పాటు కూడా నిరంతర విద్యుత్ అందని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని బోగస్‌గా మార్చిందని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. మద్దతు ధర కోసం రైతులు ఎదురుచూస్తుంటే, పంటల కొనుగోలు కేంద్రాల విషయంలో కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. వర్షాలు, తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు సకాలంలో పంటల బీమా పరిహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదని.. హామీలు మాత్రం కొండంత, అమలు మాత్రం శూన్యమని విమర్శించారు. రైతుల సమస్యలపై బీఆర్ఎస్ ఎప్పటికీ రాజీపడదని, అన్నదాతలకు అండగా నిలిచి వారి హక్కుల కోసం ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ స్పష్టం చేశారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న రైతు ప్రయోజనాలను తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, రవీందర్ యాదవ్, మాజీ మార్కెట్ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ పీఏసీఎస్ చైర్మన్లు, మాజీ వైస్ చైర్మన్లు, మాజీ వైస్ ఎంపీపీలు, బీఆర్ఎస్ మండల, గ్రామ, మున్సిపాలిటీ, వార్డు అధ్యక్షులు, ప్రస్తుత మరియు మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ యువత, అనుబంధ విభాగాల నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు..
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


