ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టాలి
-నీటి వనరుల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి -కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి : జిల్లాలోని నీటి వనరులను పరిరక్షిస్తూ వర్షపు నీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా పటిష్ఠ చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నీటిపారుదల శాఖ పనితీరుపై అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరుల్లో ఆక్రమణలకు తావులేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. చిన్నతరహా నీటిపారుదల చెరువుల కట్టల పటిష్ఠతను పరిశీలించ డంతో పాటు తూములు సక్రమంగా పనిచేస్తున్నాయో క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలన్నారు. అవసరమైన చోట మరమ్మతు పనులను గుర్తించి, నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని ఆదేశించారు. కాలువల్లో పూడిక తొలగించాలి కాలువల్లో పేరుకుపోయిన పూడిక, పిచ్చిమొక్కలను తొలగించి నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. కాలువల భూముల్లో ఆక్రమణలు ఉంటే గుర్తించి తొలగించాలని ఆదేశించారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న సమయంలో లభించే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి సాగునీటి అవసరాలకు వినియోగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలి నీటి వనరుల నిర్వహణ, కాలువల పరిస్థితి, చెరువుల కట్టలు, తూముల పనితీరును అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ తెలిపారు. అధికారులు, ఇంజినీర్లు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పనుల పురోగతిని, నీటి వనరుల పరిస్థితిని స్వయంగా పరిశీలించాలన్నారు. సమస్యలను గుర్తించిన వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖఅధికారులు, ఇంజినీర్లు,సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


