భూ-భారతి రీ-సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం.
- ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూముల హద్దుల నిర్ధారణ
- సమగ్ర భూ రికార్డుల రూపకల్పన
- రీ-సర్వే సమయంలో రైతులు, ప్రజలు అధికారులకు పూర్తి సహకారం అందించాలి...
- సర్వే అనంతరం 21 రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ..
- భూ వివరాల ఆన్‌లైన్ నమోదు అనంతరం భూధార్ కార్డుల జారీ..
- జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామంలో మంగళవారం నిర్వహించిన భూ-భారతి రీ-సర్వే అవగాహన సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొని రీ-సర్వే ఉద్దేశ్యం,చేపట్టనున్న ప్రక్రియ,ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ... తెలంగాణ ప్రాంతంలో చివరి సారిగా 1937లో భూ సర్వే జరిగిందన్నారు.చాలా సంవత్సరాల తర్వాత ప్రస్తుతం అన్ని గ్రామాల్లో సమగ్ర రీ-సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. భూ-భారతి రీ-సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో భూమి హద్దులను ఖచ్చితంగా నిర్ధారించి, సమగ్ర భూ రికార్డులను రూపొందించనున్నట్లు తెలిపారు.రీ-సర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేలా రైతులు, ప్రజలు అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. భూముల హద్దులు,రికార్డుల మార్పులతో సమస్యలు గతంలో ఒక సర్వే నంబర్‌లోని భూమి ఒకే వ్యక్తి వద్ద ఉండేదని,కాలక్రమేణా కొనుగోళ్లు,అమ్మకాలు,వారసత్వ బదలాయింపులు తదితర కారణాలతో భూములు చాలా చేతులు మారాయన్నారు. పట్టాదారు పాస్‌పుస్తకాల్లో మార్పులు జరిగినప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రతి భూమికి సంబంధించిన ఖచ్చితమైన మ్యాప్ అందుబాటులో లేకపోవడం వల్ల భూముల విస్తీర్ణంలో తేడాలు,హద్దులకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతున్నా యన్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు భవిష్యత్‌లో భూ వివాదాలకు అవకాశం లేకుండా చేయడమే సమగ్ర రీ-సర్వే ప్రధాన ఉద్దేశ్యమన్నారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రతి సర్వే నెంబర్ లో ఉన్న భూమిని క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఖచ్చితమైన హద్దులను నిర్ధారిస్తామన్నారు.
పెద్దపల్లి జిల్లాలో తొలి దశలో 70 గ్రామాల్లో రీ-సర్వే....
పెద్దపల్లి జిల్లాలో మొత్తం 190 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని,మొదటి దశలో 70 గ్రామాలను రీ-సర్వే కోసం ఎంపిక చేసినట్లు తెలిపారు.ఎంపికైన గ్రామాల్లో ఇందుర్తి కూడా ఒకటన్నారు.రీ-సర్వేలో భాగంగా ముందుగా గ్రామ సరిహద్దులను నిర్ధారించి,ఇళ్లు,ప్రభుత్వ ఆస్తులు,వ్యవసాయ భూములను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే చేస్తామన్నారు. ఆధునిక సర్వే పరికరాల సహాయంతో భూముల హద్దులను ఖచ్చితంగా గుర్తించి సమగ్ర భూ రికార్డులను రూపొందిస్తామని వెల్లడించారు.
సర్వే అనంతరం 21 రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ...
రీ-సర్వే పూర్తయిన అనంతరం గ్రామాల్లో భూ వివరాలను ప్రజల పరిశీలనకు ప్రకటిస్తామని తెలిపారు.భూ వివరాలపై ప్రజలకు 21 రోజుల గడువు ఇస్తామని,ఆ సమయంలో వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.అభ్యంతరాల పరిష్కారం అనంతరం తుది భూ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి భూధార్ కార్డులను జారీ చేస్తామని తెలిపారు.భవిష్యత్‌లో భూములకు సంబంధించిన వివరాలు సులభంగా గుర్తించేందుకు,భూ హక్కులకు భద్రత కల్పించేందుకు ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
పైలెట్ ప్రాజెక్టులో 99 శాతం సమస్యల పరిష్కారం..
రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఐదు గ్రామాల్లో నిర్వహించిన రీ-సర్వే ద్వారా సుమారు 99 శాతం భూ సమస్యలను పరిష్కరించగలిగామని తెలిపారు.భూముల విస్తీర్ణం,హద్దులు,ఇతర భూ సంబంధిత సమస్యలకు రీ-సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ-భారతి పోర్టల్ ద్వారా ఇప్పటికే అనేక భూ సమస్యలను పరిష్కరించామన్నారు.రీ-సర్వే ద్వారా రూపొందించే ఖచ్చితమైన భూ రికార్డులు భూ-భారతి వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయన్నారు.
రోజుకు 40 నుంచి 50 ఎకరాల వరకు సర్వే...
రీ-సర్వేలో భాగంగా రోజుకు సుమారు 40 నుంచి 50 ఎకరాల వరకు సర్వే నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు.భూములను ఏ సమయంలో సర్వే చేయనున్నారనే సమాచారాన్ని ముందుగానే సంబంధిత రైతులకు తెలియజేస్తామన్నారు.సంబంధిత రైతులు నిర్దేశిత సమయంలో తమ భూముల వద్ద అందుబాటులో ఉండి సర్వే సిబ్బందికి అవసరమైన సహకారం అందించాలని కోరారు.
భూములకు సంబంధించిన పత్రాలు, వివరాలతో రైతులు అందుబాటులో ఉండటం వల్ల సర్వే ప్రక్రియ మరింత సులభంగా,వేగంగా పూర్తవుతుందన్నారు.రీ-సర్వే ద్వారా రూపొందించే భూ వివరాలు రాబోయే 60 నుంచి 70 సంవత్సరాల వరకు ఉపయోగపడేలా పకడ్బందీగా రూపొందించనున్నట్లు తెలిపారు.ఆధార్ తరహాలో భూమికి ప్రత్యేక గుర్తింపుగా భూధార్ కార్డుల జారీకి ఈ రీ-సర్వే కీలకమని పేర్కొన్నారు.భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడేలా ఖచ్చితమైన భూ రికార్డులను రూపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.రీ-సర్వే సమయంలో అధికారులు, సర్వే సిబ్బందికి రైతులు, ప్రజలు పూర్తి సహకారం అందించాలని,భూ వివరాలకు సంబంధించి ఏవైనా సందేహాలు,అభ్యంతరాలు ఉంటే నిర్దేశిత ప్రక్రియలో వాటిని తెలియజేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వనజ నాయక్, ఇందుర్తి సర్పంచ్ కంకణాల లావణ్య భాస్కర్ రెడ్డి,బాయమ్మపల్లి సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజు, ఉపసర్పంచ్ లు కంకణాల సాయి చరణ్ రెడ్డి,గాలి రాజు,సంబంధిత రెవెన్యూ అధికారులు,పంచాయతీ కార్యదర్శులు,సర్వే సిబ్బంది,ప్రజాప్రతినిధులు,రైతులు, గ్రామస్థులు,తదితరులు పాల్గొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


