గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం

గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం

భూ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం....రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి*

ఆదిలాబాద్  : రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించి, తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపట్టిన భూ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్మల్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రాష్ట్ర ఎక్సైజ్‌, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నివసిస్తున్న అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుడిసెల్లో నివసిస్తున్న సుమారు 72 వేల నుంచి 73 వేల మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. మొదటి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టగా, రెండో దశలో మరో రెండు లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక స్థోమత లేని లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించి నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అటవీ సంబంధిత సమస్యల కారణంగా ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోకుండా, పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని సూచించారు. అవసరమైతే ఈ అంశంపై రాష్ట్రస్థాయిలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూముల సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి తెలిపారు. గతంలో సుమారు 125 ఏళ్ల క్రితం భూముల సర్వే జరిగిందని, ప్రస్తుతం వచ్చే ఏడాదిన్నరలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో భూ సర్వే పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.  మనిషికి ఆధార్‌ ఎలాగో ప్రతి భూ కమతానికి భూధార్‌ రూపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. భూముల సమగ్ర సర్వేతో భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా చూడవచ్చని పేర్కొన్నారు. సర్వే ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. సర్వేను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అదనపు సామగ్రిని సమకూరు స్తామని తెలిపారు. యువ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. భూ సర్వేలో పనిచేయడం ద్వారా అధికారులకు క్షేత్రస్థాయి పరిపాలనపై మంచి అవగాహనతో పాటు భవిష్యత్తులో తమ సర్వీసులో ఉపయోగపడే అనుభవం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో రెవెన్యూ, అటవీ శాఖలకు సంబంధించిన సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో భూ సర్వేను దశలవారీగా నిర్వహించి, ప్రతి భూ కమతానికి ల్యాండ్‌ పార్సెల్‌ మ్యాపింగ్‌ (ఎల్‌పీఎం) నంబర్‌ కేటాయించే ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. భూములకు సంబంధించిన సమగ్ర వివరాలను నమోదు చేసి, భూ హక్కులకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో ఉండాలి....మంత్రి జూపల్లి కృష్ణారావుఅధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రాష్ట్ర ఎక్సైజ్‌, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సమర్థవంతంగా అందేలా అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా పరిపాలన ఉండాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి బలమైన సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని పనిచేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అటవీ సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయని, సంబంధిత అధికారులు తమ పరిధిలోని సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి భూ సర్వే ఒక గొప్ప అవకాశమని మంత్రి పేర్కొన్నారు. గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు సర్వే ప్రక్రియపై అవగాహన కల్పించాలని, నిర్దేశిత గడువులోగా సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ లోకేష్‌కుమార్‌, రెవెన్యూ శాఖ (రిజిస్ట్రేషన్లు, స్టాంపులు) ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.పి.గౌతమ్‌, నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా, ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌ హరిత, ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌, ముధోల్‌ ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌, బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌ బాబు, ఐటీడీఏ పీవో మంద మకరందు, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల అదనపు కలెక్టర్లు, సబ్‌ కలెక్టర్లు, రెవెన్యూ, గృహ నిర్మాణ, అటవీ శాఖల అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News