లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు...
హన్మకొండ న్యూస్ : వర్ధన్నపేట నియోజకవర్గంలోని 3వ డివిజన్ పైడిపల్లి గ్రామంలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేస్తున్నామని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల ద్వారా ఆడపిల్లల వివాహ సమయంలో పేద కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. అదే విధంగా స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు నిత్యావసర సరుకులు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం పైడిపల్లి చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన వీధి లైట్లను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ అధ్యక్షులు జన్ను అరుణకర్, వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్, మాజీ కార్పొరేటర్ జన్ను షిభారాణి అనిల్, మాజీ పాక్స్ చైర్మన్ బుద్దే పెద్దన్న, సీనియర్ నాయకులు అభిషేకం,సంపత్,రవి కుమార్,రాజు,వంశీ, బోయినీ ఐలయ్య,గట్టు బాలరాజు,జాన్సన్,నవీన్, సతీష్,ప్రసాద్,స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


