రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కు సత్వర చర్యలు
- పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ముందస్తు చర్యలు
- గంభీరావుపేటలో విద్యుత్ సరఫరా పరిస్థితిని పరిశీలించిన సీఈ బి. అశోక్
గంభీరావుపేట : రైతులు,వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని టీజీఎన్‌పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ బి. అశోక్ ఆదేశించారు.మంగళవారం గంభీరావుపేట మండలంలోని సెక్షన్‌లోని గంజిసింగపురం 33/11 కెవి సబ్‌స్టేషన్‌ను అలాగే 33 కె.వి గంభీరావుపేట ఫీడర్ ను మంగళవారం పరిశీలించి విద్యుత్ లోడ్లు, వోల్టేజ్ స్థాయిలు, ట్రాన్స్‌ఫార్మర్ల పనితీరు, ఫీడర్ల స్థితిగతులు, నిర్వహణ చర్యలను సమీక్షించారు. వ్యవసాయ రంగానికి అందుతున్న విద్యుత్ సరఫరా పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన, విశ్వసనీయ విద్యుత్ సరఫరా అందించాలని సీఈ అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలు, లో-వోల్టేజ్ సమస్యలు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించి పరిష్కరించే విధంగా క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మరమ్మతు లకు గురైన ట్రాన్స్‌ఫార్మర్ల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకొని విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరిం చాలని తెలిపారు. అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు, కండక్టర్లు, ఫ్యూజులు, ఇతర విద్యుత్ సామగ్రిని ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.ప్రతి సర్కిల్‌లో అధికారులు తమ హెడ్‌క్వార్టర్లలో అందుబాటులో ఉంటూనే క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటించి విద్యుత్ మౌలిక వసతుల పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని సీఈ కె. అశోక్ స్పష్టం చేశారు. సబ్‌స్టేషన్లు, ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు తదితర విద్యుత్ మౌలిక వసతుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఈ కె. అశోక్ స్పష్టం చేశారు. సీఈ వెంట రాజన్న సిరిసిల్ల ఎస్ఈ శ్రీనివాస్ రావు, డి.ఈ బి. అంజయ్య, గంభీరావుపేట ఏఈ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


