విలాసాగర్‌లో ఉచిత వైద్య శిబిరం, సీజనల్ వ్యాధులపై అవగాహన
కాటారం (భూపాలపల్లి) : కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని విలాసాగర్ గ్రామంలో స్థానిక వైద్యాధికారిణి డాక్టర్ మౌనిక ఆదేశాల మేరకు ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి మంగళవారం, శుక్రవారం తప్పనిసరిగా డ్రై డే పాటించాలని సూచించారు. ఇళ్లలో పాత సామగ్రి, పాత టైర్లు, కొబ్బరి బోండాలు వంటి వాటిని నిల్వ ఉంచ కూడదని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నీటి గుంతలు ఉంటే వెంటనే పూడ్చివేయా లని సూచించారు. దోమల వృద్ధిని అరికట్టడంతో పాటు, దోమలు కుట్టకుండా దోమతెరలు వినియోగించాలని, ఇళ్లలోకి దోమలు ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జ్వరం వచ్చిన వెంటనే ఆశా కార్యకర్త లేదా ఆరోగ్య కార్యకర్తను సంప్రదిం చాలని, జ్వరానికి సంబంధించిన రక్త పరీక్షలు కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నట్లు ప్రజలకు వివరించారు. అవసరమైన వారు పీహెచ్‌సీని సందర్శించి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. శిబిరంలో వైద్య పరీక్షలతో పాటు డ్రై డే కార్యక్రమం నిర్వహించి ప్రజలకు దోమల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విలాసాగర్ స్థానిక సర్పంచ్ కె. రాజయ్య, ఎం ఎల్ పీ హెచ్ డాక్టర్ సుమన్, మహిళా హెల్త్ అసిస్టెంట్ రజిని, ఆరోగ్య సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


