కరీంనగర్ నగరపాలక సంస్థలో అవినీతిపై జెన్-జీ నిఘా
- 22ఏ భూములకు త్వరలో పరిష్కారం,
- సీఎంపై విమర్శలపై కొండా సుస్మిత క్షమాపణ చెప్పాలి
- వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్,: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు, పారదర్శక పాలన కోసం యువ న్యాయ వాదులు, సమాచార హక్కు కార్యకర్తలు, సాంకేతిక నిపుణులతో 40 నుంచి 50 మందితో జెన్-జీ నిఘా సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు ప్రకటించారు. కరీంనగర్ మైత్రి హోటల్‌లో శనివారం మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న,కార్పొరేటర్లు, సర్పంచులు, నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నగరపాలక సంస్థలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇంజనీరింగ్ పనులు, పట్టణ ప్రణాళిక అనుమతుల వరకు ప్రతి అంశాన్ని ఈ నిఘా సంఘం పరిశీలిస్తుందని, ఏ డివిజన్‌లో ఏ పని మంజూరైంది, ఎంత నిధులు కేటాయించారు, పనుల నాణ్యత ఎలా ఉంది, బిల్లులు ఎలా చెల్లించారు అనే వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించి క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తామని, పెద్ద భవనాలు, వాణిజ్య సముదాయాలకు అనుమతి ఒకటి ఇచ్చి నిర్మాణం మరొకటి చేసే విధానానికి, గొలుసుకట్టుగా సాగుతున్న అవినీతి వ్యవహారాలకు చెక్ పెడతామని, ఇటీవల పట్టణ ప్రణాళిక విభాగంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేయాల్సిన పరిస్థితి రావడం ఆందోళనకరమని, గత భారత రాష్ట్ర సమితి పాలకుల కంటే ప్రస్తుత భారతీయ జనతా పార్టీ పాలకుల హయాంలోనే అవినీతి ఎక్కువైందని ఆరోపించారు.ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే ఫిర్యాదు చేసేందుకు నిఘా సంఘం సభ్యుల ఫోన్ నంబర్లను నగరంలోని ప్రధాన కూడళ్లలో బోర్డుల ద్వారా తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేస్తానని, వెలిచాల ప్రజా కార్యాలయం, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తామని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే వ్యవహారాలను గుర్తించి వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు క్లీనింగ్ ఆపరేషన్ చేపడతామని తెలిపారు.అదేవిధంగా రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లి ప్రాంతాల్లో దాదాపు 140 సర్వే నంబర్లలో వెయ్యి ఎకరాల వరకు 22ఏ నిషేధిత జాబితాలోకి వెళ్లి రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బాధితులు పడుతున్న ఇబ్బందులను 300 మంది బాధితులను పిలిపించి స్వయంగా విన్నానని, వెంటనే జగిత్యాలకు వెళ్లి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం ఇవ్వగా మంత్రి సానుకూలంగా స్పందించి జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారని, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో రెండుసార్లు మాట్లాడానని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థాయిలో ఈ సమస్య పరిష్కారానికి చర్యలు జరుగుతున్నాయని, అతి త్వరలోనే బాధితులకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత వీధి రౌడీలా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని, కాంగ్రెస్ సభ్యత్వం లేకపోయినా ఇలా రెండు మూడు సార్లు విమర్శలు చేయడం సరికాదని, ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తే సహించేది లేదని, ప్రజల మధ్య ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, కార్పొరేటర్లు గుమ్మడి రాజకుమార్, భాస్కర్ నాయక్, ఆకుల నందిని ఉదయ్, విక్రమ్ సికిందర్, కళ్లేపల్లి శారద బాలరాజు, గంట శ్రీనివాస్, సర్పంచులు కమలాకర్ గౌడ్, తిరుపతిరెడ్డి, బోగొండ ఐలయ్య, అనంతుల రమేష్, 22ఏ భూ బాధితుల ఐక్యవేదిక అధ్యక్షుడు పాషా మోహన్ రెడ్డి, రేకుర్తి మాజీ ఉపసర్పంచ్ గొల్ల కృష్ణయ్య, సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Views: 20
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Aug 2026 18:45:12
నాంపల్లి : మండలంలోని మహమ్మదాపురం, మల్లపురాజుపల్లి గ్రామాలలో శుక్రవారం ఎల్ నినో ప్రభావం మరియు ప్రస్తుత పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ విస్తరణ అధికారిణి...
